వరంగల్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ);బతుకమ్మ కానుకలు వచ్చేస్తున్నాయి. ఏటా సద్దుల పండుగకు కేసీఆర్ సర్కారు ఆడబిడ్డలకు రంగురంగుల, నాణ్యమైన చీరెలు తయారుచేయించి పంపుతున్నది. ఈమేరకు జిల్లాకు మూడు లక్షల చీరెలు కేటాయించాలని నిర్ణయించగా ఇప్పటికే నర్సంపేటకు 42,230 పంపింది. త్వరలో మిగతావి రానుండగా వీటిని వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్, నర్సంపేట మార్కెట్లలో భద్రపర్చనున్నారు. మొత్తం చీరలు వచ్చిన తర్వాత ఈ నెల 17 నుంచి పంపిణీ చేయనున్నారు. ఈసారి ప్రత్యేకంగా డాబి అంచు చీరెలు అందిస్తుండడంతో మహిళల్లో అంతులేని ఆనందం వెల్లివిరుస్తోంది.
బతుకమ్మ కానుకలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే 42,230 చీరెలు జిల్లాకు చేరుకున్నాయి. వీటిని అధికారులు నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో భద్రపరిచారు. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఏటా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరెలను కానుకగా ఉచితంగా అందజేస్తున్నది. గతేడాది జిల్లాలో 2.96 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరెలు ఇవ్వగా కేవలం వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోనే 1,23,400 పంపిణీ చేసింది. ప్రస్తుతం పద్దెనిమిదేళ్లు నిండిన వారితో కలిపి జిల్లాలో సుమారు మూడు లక్షల చీరెలు పంపిణీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా పరిశీలించిన తర్వాత మూడు లక్షల బతుకమ్మ చీరెలను జిల్లాకు కేటాయించాలని నిర్ణయించింది. వీటిని ఈ నెల 17నుంచి అన్ని గ్రామాలు, వార్డులు, డివిజన్లలో లబ్ధిదారులకు అందజేయాలని సర్కారు ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ కొద్ది రోజుల నుంచి బతుకమ్మ చీరెలను విడుతలవారీగా లారీల ద్వారా జిల్లాలకు చేరవేస్తున్నది. గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వీటిని దిగుమతి చేసుకొని ప్రస్తుతం గోదాముల్లో భద్రపరుస్తున్నారు. డాబీ అంచు ఉండడం ఈసారి బతుకమ్మ చీరెల ప్రత్యేకత.
రెండు చోట్ల చీరెల దిగుమతి
జిల్లాకు వచ్చే బతుకమ్మ చీరెలను రెండుచోట్ల భద్రపరచాలని అధికారులు నిర్ణయించారు. నర్సంపేట రెవె న్యూ డివిజన్ పరిధిలోని ఆరు మండలాలకు సంబంధించిన చీరెలను నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ గోదాములో భద్రపరిచేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. వరంగల్, ఖిలావరంగల్, గీసుగొండ, సం గెం, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాలకు సంబంధించిన చీరెలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఓ గోదాములో భద్రపరచాలని నిర్ణయించారు. ఈమేరకు గోదాములో ఏర్పాట్లు కూడా చేశారు. తొలివిడుత గురువారం లారీల ద్వారా జిల్లాకు చేరిన 42,230 బతుకమ్మ చీరెలను నర్సంపేటలోని గోదాములో దిగుమతి చేశారు.
ఇక్కడ వీటిని భద్రపరిచినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ డీపీఎం దయాకర్ వెల్లడించారు. ఇంకా 2.57 లక్షలకుపైగా బతుకమ్మ చీరెలు జిల్లాకు రావాల్సి ఉంది. వీటిలో కొన్నింటిని నర్సంపేట గోదాములో భద్రపరిచి మిగతా వాటిని ఎనుమాములలోని గోదాములో భద్రపరిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం చీరెలు జిల్లాకు చేరుకున్న తర్వాత నర్సంపేట, ఎనుమాముల గోదాముల నుంచి మండలాలు, గ్రామాలు, వార్డులు, డివిజన్లకు తరలిస్తారు. పండుగ వాతావరణంలో బతుకమ్మ చీరెలను మహిళలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.