హనుమకొండ, సెప్టెంబర్ 2 : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభు త్వ శాఖలు సమన్వయంతో పని చే యాలని సీపీ తరుణ్‌జోషి సూచించారు. హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశానికి హనుమకొండ, వరంగల్ కలెకర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భం గా అధికారులు ఉమ్మడి జిల్లాలో రోడ్డు భద్రతపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి మాట్లాడుతూ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రజల్లో ట్రాఫి క్ నియమాలపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు కృషి చేయాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు జిల్లాలోని ప్రధాన రహదారులను మరింత సురక్షితంగా తీర్చిదిద్దాలని, రహదారి భద్రతపై అవగాహన పెంపొందించాలని చెప్పారు. ప్రభుత్వ అధికారులు రోడ్డు భద్రతా నియమాలు కచ్చితంగా పాటించి ప్రజలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు.
ప్రత్యేకించి ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆయన సూచించారు. సబర్బన్ ఏరియా నుంచి నగరంలోకి వచ్చే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కోరారు. డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ నియంత్రణకు బ్రీత్ ఎనలైజర్లు, స్పీడ్ గన్లను ఎకువ సంఖ్యలో వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరుగకుండా హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని పది ప్రాంతాల్లో రోడ్లను విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని సీపీ పేర్కొన్నారు. హనుమకొండ కలెక్టర్ రాజీవ్‌గాంధీహన్మంతు మాట్లాడుతూ జిల్లాలో 14 బ్లాక్ స్పాట్లు, వరంగల్ జిల్లాలో 10 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారని తెలిపారు. హనుమకొండ జిల్లాలో 2021లో 241 మంది క్షతగాత్రులు కాగా, 106 మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మరణించారని, 2022లో ఇప్పటి వరకు 270 మంది క్షతగాత్రులు కాగా, 110 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారని పేర్కొన్నారు.
రహదారి నిర్మాణంలో ఇంజినీరింగ్ పరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రమాదకరమైన యూ టర్న్‌లను మూసేయాలని, ప్రమాదాలు ఎకువగా జరుగుతున్న జాతీయ రహదారులను రెగ్యులర్‌గా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల ను సత్వరమే పునరుద్ధరించాలని సంబంధిత శాఖల అధికారులను సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, శ్రీవత్స, జిల్లా న్యాయాధికారి సంస్థ సెక్రటరీ ఉపేందర్‌రావు, మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.