వరంగల్, ఆగస్టు 29 : రాబోయే గణేశ్ విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కార్పొరేషన్లో ఇంజినీరింగ్ అధికారులతో గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు, పట్టణ ప్రగతి పనులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రేట ర్ పరిధిలో వేల సంఖ్యలో గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకుని నిమజ్జన ఏర్పాట్లు చేయాలని అన్నారు. హనుమకోండ ప్రాంతంలో 14 ప్రదేశాలు, వరంగల్ ప్రాంతంలో 10 ప్రదేశాల్లో నిమజ్జన ఏర్పాట్లు చేయాలన్నారు.
వరంగల్ ప్రాంతాల్లోని చిన్నవడ్డేపల్లి చెరువు, ఉర్సు చెరువు, బెస్తం చెరువు, గుండు చెరువు, కట్టమల్లన్న, ఆగర్తాల, సింగారం చెరువు, మామునూరు చెరువు, తిమ్మాపూర్ చెరువు, హనుమకొండ ప్రాంతంలోని బంధంచెరువు, గోపాల్పూర్చెరువు, భీమారం, వంగపహడ్,ఎల్లాపూర్, పెగడపల్లి, కడిపికొండ, రాంపేట్, రాంపూర్, సోమిడి, హసన్‌పర్తి, మడికొండ,గుండ్లసింగారం చెరువుల్లో నిమజ్జన ఏర్పాట్లు చేయాలన్నారు.
పట్టణ ప్రగతిపై సమీక్ష
పట్టణ ప్రగతి కార్యాక్రమంలో గుర్తించి చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై మేయర్ గుండు సుధారాణి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. పట్టణ ప్రగతిలో గుర్తించి సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలన్నారు. డివిజన్‌కు రూ. 50 లక్షల అభివృద్ధి నిధులు కేటాయించిన నేపథ్యంలో కార్పోరేటర్ల నుంచి మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు.
విద్యుత్ స్తంభాల ఏర్పాటు, పైన్‌లైన్లు, డ్రైనేజీ, రోడ్లకు సంబందించిన ప్రతిపాదనలకు అంచనాలు చేసి పనులు మొదలు పెట్టాలని ఆమె అధికారులను ఆదేశించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, పకృతి వనాల ఏర్పాటుపై శ్రద్ధ పెట్టాలన్నారు. నగర రోడ్లపై గుంతలను మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఈఈలు శ్రీనివాస్ రావు, బీఏల్ శ్రీనివాస్ రావు, ఈఈలు సంజయ్, రవికుమార్, డీఈలు సంతోష్‌బాబు, సారంగం, నరేందర్, ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.