చపాట మిర్చికి నర్సంపేట పెట్టింది పేరు. ఈ డివిజన్లోని నేలలు, వాతావరణం పంట సాగుకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ దేశవాళీ మిర్చికి మంచి డిమాండ్ ఉంటోంది. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ పంటకు గిట్టుబాటు ధర దక్కుతుండడంతో ఎక్కువ మంది రైతులు చపాటా మిర్చి వైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది జిల్లాలో 19,057 ఎకరాల్లో సాగు కాగా, దిగుబడి అధికంగా వస్తుందనే ఆశతో మళ్లీ ఉత్సాహంగా సాగుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశమున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేయగా ఇప్పటికే నారుమళ్లు సిద్ధంచేసిన రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే డివిజన్లో మిర్చి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నర్సంపేట రూరల్, ఆగస్టు 29: జిల్లాలో మిర్చి పంట సాగు పనులు ఊపందుకున్నాయి. ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. అన్ని చెరువులు ఇప్పటికే మత్తడి సైతం పోశాయి. ప్రస్తుతం కొన్ని చెరువులు నిర్విరామంగా మత్తడి పోస్తూనే ఉన్నాయి. అంతేగాక వ్యవసాయ బావుల్లో భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. దీంతో ఈ దఫా వానకాలం, యాసంగి పంటలకు ఎలాంటి ఢోకా లేకపోవడంతో రైతులు ఉత్సాహంగా వివిధ రకాల పంటల సాగు చేపట్టారు.
ముఖ్యంగా జిల్లాలోని నర్సంపేట, వరంగల్, వర్ధన్నపేట డివిజన్లోని అన్ని మండలాల్లో రైతులు మిరుపనారు పనుల్లో, నారు విత్తే క్రమంలో ప్రస్తుతం బిజీగా ఉన్నారు. జిల్లావ్యాప్తంగా మిరప పంట సాగు సాధారణంగా 12,500 ఎకరాలు కాగా, గతేడాది 19,057 ఎకరాల్లో సాగైనట్లు అధికార నివేదికలు తెలుపుతున్నాయి. గతేడాది మిర్చికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో తగిన గిట్టుబాటు ధర లభించింది. దీంతో ఈ దఫా రైతులు మిర్చి సాగు పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అధిక దిగుబడులు సాధించాలనే ఆశతో మళ్లీ ఉత్సాహంగా మిర్చి సాగుకు రైతులు శ్రీకారం చుట్టారు.
నర్సంపేట డివిజన్లో(నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట) గతేడాది 17,139 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేయగా, ఈ ఏడాది అది మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. తొలుత జూన్ నెలలో కురిసిన తొలకరి వర్షాలకు భూముల్లో వేరుశనగ, మక్కజొన్న పంటలు వేయగా, ఆ పంటల కాలపరిమితి పూర్తికావడంతో వాటిని రైతులు ఇళ్లకు, దగ్గరలోని మార్కెట్లకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత మిరప సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం నెల రోజుల ముందుగానే నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం నారు ఏపుగా పెరగడంతో రైతులు వాటిని నాటేందుకు సిద్ధమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
నర్సంపేట చపాట మిర్చికి పెట్టింది పేరు
చపాట(దేశవాళి) మిర్చి అనగానే వరంగల్ ఉమ్మడి జిల్లాలో అందరికి గుర్తుకు వచ్చేది నర్సంపేట. నాణ్యమైన మిర్చిని పండించడం ఇక్కడి ప్రత్యేకత. ఏళ్ల తరబడి ఈ డివిజన్లో రైతులు మిర్చిని సాగు చేస్తున్నారు. పండించిన నాణ్యమైన చపాట మిర్చిని ఇతర దేశాలు, రాష్ర్టాలకు తరలించి విక్రయిస్తుంటారు. ముంబై, నాగపూర్, అహ్మదాబాద్, జలగాం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేసి గతంలో ఆర్థికంగా స్థిరపడిన రైతులు ఈ ప్రాంతంలో చాలామంది ఉన్నారు. అందులో నర్సంపేట, దుగ్గొండి, నల్లబెల్లి మండలాల్లో చపాట మిర్చిని ఎక్కువగా రైతులు సాగుచేస్తున్నారు.
ముఖ్యంగా నర్సంపేట మండలం దాసరిపల్లి, కమ్మపల్లి, భాంజీపేట, చంద్రయ్యపల్లి, మాదన్నపేట, నాగుర్లపల్లి, ఇటుకాలపల్లి, ముత్తోజిపేట, లక్నేపల్లి, మహేశ్వరం, భోజ్యానాయక్‌తండా, చక్రంతండా, గురిజాల, ముగ్దుంపురం, రాజపల్లి, చిన్నగురిజాల, గుర్రాలగండిరాజపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఉత్సాహంగా మిర్చి సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. గత అనుభవాలు, లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఏడా ది నర్సంపేట మండలంలో 3,123 ఎకరాలకు పైగా మిర్చి సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోటి ఆశలతో మిర్చి పంట సాగుకు శ్రీ కారం చుడుతున్న రైతులకు కేంద్ర ప్రభు త్వం కనీస మద్దతు ధర కల్పిస్తే బాగుంటుందని పలువురు రైతులు కోరుతున్నారు.
మిర్చి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అడుగులు
నర్సంపేటలో మిర్చి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ప్రపంచ స్థాయిలోనే నర్సంపేట డివిజన్లో పండించే మిర్చికి మొదటి నుంచీ మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి నేలలు, వాతావరణం చపాట మిర్చికి అనుకూలంగా ఉండడం వల్ల దిగుబడి కూడా అధికంగా వస్తుంది. అందుకే ఈ ప్రాంతం నుంచే మేలైన విత్తనాలు ఇతర ప్రాంతాలకు దిగుమతి అవుతున్నాయి. ఈమేరకు రెండేళ్ల క్రితం ఉద్యానవన అధికారులు అశోక్‌నగర్ ప్రాంతాన్ని మిర్చి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం పరిశీలించారు. గత జిల్లా కలెక్టర్ ఎం.హరిత సైతం రెండు సార్లు ఈ స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదించగా, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పలు దఫాలుగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించే ఈ సెంటర్‌ను నర్సంపేటకు తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. మిర్చి రీసెర్చ్ సెంటర్ ఈప్రాంతానికి అందుబాటులోకి వస్తే నర్సంపేట డివిజన్ రైతులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
అంతర్జాతీయంగా మంచి డిమాండ్
గతేడాది జిల్లావ్యాప్తంగా 14,997మంది రైతులు 19,057 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. ఈ సంవత్సరం గతం కంటే ఎక్కువ మొత్తంలో మిర్చి సాగు చేసేందుకు రైతులు ప్రస్తుతం సిద్ధంగా ఉన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మిర్చికి మంచి గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతులు ఆసక్తిగా సాగు చేపడుతున్నారు. గత ఏడాది చెన్నారావుపేట మండలంలో 2,037 ఎకరాలు, దుగ్గొండిలో 4,290 ఎకరాలు, ఖానాపురంలో 1,216 ఎకరాలు, నల్లబెల్లిలో 4,706 ఎకరాలు, నర్సంపేటలో 3,123ఎకరాలు, నెక్కొండలో 1,767 ఎకరాలు, గీసుగొండలో 350 ఎకరాలు, ఖిలావరంగల్‌లో 3 ఎకరాలు, పర్వతగిరిలో 429 ఎకరాలు, రాయపర్తిలో 395 ఎకరాలు, సంగెంలో 549 ఎకరాలు, వరంగల్‌లో 2 ఎకరాలు, వర్ధన్నపేటలో 186 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు.
– నల్లా తిరుపతి, హార్టికల్చర్ అధికారి, వరంగల్