దళితులను బీజేపీ చిన్న చూపు చూస్తోంది. పాదయాత్రలో బండిని ఎదురు ప్రశ్నించిన పాపానికి ఓ వ్యక్తిపై ఆ పార్టీ కార్యకర్తలు కులం పేరుతో దూషించడంతో పాటు దాడి చేశారు. దీంతో కమలం పార్టీ దళిత వ్యతిరేమని తేలిపోయిందని స్థానికులు చర్చించుకుం టున్నారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్షులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి.
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 22 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా శనివారం రాత్రి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని మీదికొండ గ్రామం లో సభ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని బండి సంజయ్ మాట్లాడుతుండగా స్థానికుడు జోగు రాంచందర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏమయ్యాయి?, జీఎస్టీతో నిత్యావసరాలు, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగడంతో నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారని ప్ర శ్నించాడు. దీంతో బీజేపీ గూండాలు, పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి కులం పేరుతో దుర్భాషలాడి దాడి చేశారు.
సీఐ ఎడవెళ్లి శ్రీనివాస్‌రెడ్డి వారి నుంచి కాపాడాడు. కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తున్న రాంచందర్‌పై బీజేపీ గూండాల దాడితో ఈ పార్టీ దళిత వ్యతిరేకని నిరూపితమైందని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో దళితులు, నిరుపేదలపై దాడులు చేయడం సరి కాదన్నారు. రాంచందర్‌పై దాడిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కార్యకర్తలతో స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు ర్యాలీగా వచ్చి సీఐకి ఫిర్యాదు చేశారు.
బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి, మహిళా కార్యక్తపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈడీ కేసులు, సీబీఐ దాడులు చేస్తూ బీజేపీ బెదిరిస్తోందని, అనవసరపు ఎన్నికలను తీసుకు వచ్చి అక్రమ మార్గంలో అధికారంలోకి రావాలని చూస్త్తోందని అన్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని కాషాయ రంగుగా మార్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బండి సంజయ్ జనగామ జిల్లా ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, ఆయన పాదాలకు మొక్కాలని, లేదంటే ప్రజలే మీకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.