నమస్తే నెట్వర్క్: స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వనమహోత్సవం జోరుగా సాగింది. ఊరూరా మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. సబ్బండ వర్గాలు భాగస్వాములై విజయ వంతం చేశారు. భూపాలపల్లి మండలంలోని కొంపెల్లి, గుడాడ్పల్లి, గొర్లవీడు గ్రామాల్లోని రహదారి వెంట అధికారులు హరితహారం కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అడిషనల్ కలెక్టర్ దివాకర ముఖ్య అతిథులుగా హాజరై మొక్కలు నాటారు. జనగామలోని శామీర్‌పేటకు సమీపంలో ఉన్న డివైడర్ల మధ్య, వడ్లకొండ శివారులోని చంపక్ హిల్స్‌లోని సబ్ స్టేషన్ వద్ద కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో జర్నలిస్టులు నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ప్రదర్శించారు.
మహబూబాబాద్ మండల పరిధిలోని జర్పులతండా గ్రామ పంచాయతీలోని బృహత్ పల్లె ప్రకృతి వనంలో కలెక్టర్ శశాంక, అదనపు కలెక్టర్ అభిలాషాఅభినవ్, డీఎఫ్‌వో రవికిరణ్‌తో కలిసి మొక్కలు నాటారు. పట్టణంలోని ఆర్టీసీ డిపోలోదేశ చిత్ర పటాన్ని వేసి ఉద్యోగులు గీతాలాపన చేశారు. అనంతరం
పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమ తులను ప్రదానం చేశారు. కురవి మండలం కాకులబోడు తండాలో నాలుగు వేల మొక్కలను నాటారు.
తొర్రూరులో వివిధ ప్రభుత్వ శాఖలు, జర్నలిస్టు జట్టుతో కలిపి ఫ్రీడం క్రికెట్ పోటీలను యతిరాజారావు స్మారక పార్క్ ఆవరణలో ప్రారంభించారు. ములుగు జిల్లా కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో, ప్రధాన కూడళ్లలో కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏఎస్పీ రామ్నాథ్కేకన్తో కలిసి మొక్కలు నాటారు. గ్రేటర్ 49వ డివిజన్ ప్రగతినగర్ కాలనీలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మేయర్ గుండు సుధారాణి తో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ప్రారంభించారు. అనంతరం పార్కులో మొక్కలు నాటి, గడ్డితో ప్రత్యేకంగా రూపొందించిన భారతదేశ చిత్ర పటాన్ని ఆవిష్కరించారు.
కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్‌రాజ్‌యాదవ్, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య పాల్గొన్నారు. పరకాలలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తదితరులు మొక్కలు నాటారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత పాల్గొన్నారు. కోగిల్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని వంచనగిరి మాడల్ స్కూల్, కోనా యిమాకుల రైతు వేదిక వద్ద కలెక్టర్ బీ గోపి, అడిషన్ కలెక్టర్ హరిసింగ్‌తో కలిసి మొక్కలు నాటి నీళ్లు పోశారు.