పర్వతగిరి, ఆగస్టు 17: మండలకేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను బుధవారం స్టాండింగ్ కమిటీ ఆరో స్థాయి సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్, జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్ ఆకస్మికంగా ఎంపీపీ లునావత్ కమలా పంతులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ముందుగా గురుకుల పాఠశాల గేటు వద్దకు చేరుకున్న జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ సర్వర్ ప్రిన్సిపాల్‌కు సమాచారం అందించారు. 20 నిమిషాల తర్వాత గురుకులంలోకి జడ్పీటీసీ బృందానికి అనుమతించారు. దీంతో పాఠశాలలోని వంటశాలలోకి వెళ్లి వంటలను పరిశీలించే క్రమంలో పప్పు నీళ్లచారుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో ప్రిన్సిపాల్ వంటగదికి చేరుకొని ‘ఏ అధికారంతో మీరు వంటగదిలోకి వచ్చారు’ అంటూ జడ్పీటీసీ బృందాన్ని ప్రశ్నించారు. తాను చైర్మన్ అని సింగ్‌లాల్ వివరణ ఇవ్వగా.. అయినా గదిలోకి ఎందుకు ప్రవేశించారని అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, మంత్రి, సీఎం అయినా తనను ఏమీ చేయలేరని ప్రిన్సిపాల్ ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రిన్సిపాల్‌కు తోడుగా లైబ్రేరియన్ మీనా, రికార్డు అసిస్టెంట్ పవన్ స్థానిక ప్రజాప్రతినిధులపై ఒకింత ఆగ్రహంతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో చైర్మన్ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కు ఫోన్ చేసి వివరాలు తెలియజేశారు. ఎమ్మెల్యే అరూరి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు సమాచారం అందించారు.
ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు
ఎమ్మెల్యే అరూరి రమేశ్, మంత్రి ఎర్రబెల్లి కలిసి సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల ప్రిన్సిపల్ కార్యదర్శి రోనాల్డ్‌కు ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపల్ కార్యదర్శి ఈ ఘటనపై ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ తాను తప్పుగా మాట్లాడితే క్షమించాలని ప్రజాప్రతినిధుల బృందాన్ని ప్రాధేయపడ్డారు. తర్వాత చైర్మన్ సింగ్‌లాల్ పర్వతగిరి పోలీస్‌స్టేషన్‌లో ప్రిన్సిపాల్ దురుసు ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సింగ్‌లాల్ మాట్లాడుతూ తాము నిబంధనల మేరకు గురుకుల పాఠశాలను తనిఖీ చేయగా, ప్రిన్సిపాల్ మెస్ నిబంధనలు పాటించకుండా తమపై దురుసుగా ప్రవర్తించారని తెలిపారు.
గురుకుల పాఠశాల ఆవరణలో విద్యార్థుల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్వహణను ఎంపీపీ కమల, సర్పంచ్ మాలతి, ఎంపీటీసీ మహేంద్ర పరిశీలించారని, మరుగుదొడ్లు కంపు కొడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడగా, రోజుకు ఒకేరకమైన కూరగాయల భోజనం వడ్డిస్తున్నారని, బియ్యంలో రాళ్లు వస్తున్నాయని, శుభ్రమైన తాగునీరు లేదని, హాస్టల్లో విపరీతమైన దోమలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. గురుకుల పాఠశాలలో వసతులు కల్పించాలనే ఉద్దేశంతోనే తాము తనిఖీ చేయగా, ఆ సమయంలో ప్రిన్సిపాల్ సంయమనం కోల్పోయి దురుసుగా ప్రవర్తించి ప్రజాప్రతినిధులను అగౌరవ పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనిఖీ చేసే అధికారం లేదనడం సరికాదు
గురుకులాన్ని తనిఖీ చేసే అధికారం తమకు లేదని ప్రిన్సిపాల్ అనడం బాధ కలిగించిందని జడ్పీటీసీ బానోత్ సింగ్‌లాల్ అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరూరి రమేశ్ జోక్యం చేసుకుని మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుండగా, పర్వతగిరి గురుకులంలో ఇలాంటి దుస్థితి ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు తనిఖీ చేసే క్రమంలో ప్రిన్సిపాల్ అడ్డుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలపై నిఘా ఏర్పాటు చేయడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పించేలా తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, పర్వతగిరి ఎంపీటీసీలు మాడ్గుల రాజు, మహేం ద్ర, సోమారం సర్పంచ్ రేణుకా నాగయ్య పాల్గొన్నారు.