స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ‘రక్తదానం.. ప్రాణదానంతో సమానం’ అనే నినాదం మార్మోగింది. ఉమ్మడి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం రక్తదాన శిబిరాలు ఉత్సాహంగా నిర్వహించారు. యువత ముందుకు వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేసింది. వేలాది మంది పాల్గొని రక్తదానం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములయ్యారు. ఎంజీఎం దవాఖాన, హనుమకొండ, హసన్‌పర్తి, స్టేషన్‌ఘన్‌పూర్‌లో మంత్రి ఎర్రబెల్లి, నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పాల్గొని రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు.
వజ్రోత్సవాల వేళ బుధవారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో వేలాది మంది రక్తదానం చేశారు. వారికి సర్టిఫికెట్లు అందజేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించగా, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేశ్‌మిశ్రా హాజరై ప్రారంభించారు. సుమారు 250 మంది రక్తదానం చేశారు. డీఎంహెచ్‌వో డాక్ట ర్ శ్రీరాం, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సంజీవయ్య తదితరులు పాల్గొ న్నారు. మహబూబాబాద్ జిల్లా వైద్యశాలలో కలెక్టర్ శశాంక రక్తదానం చేశారు.
ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ పాల్గొన్నారు. డోర్నకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి ఎంపీ మాలోత్ కవిత ప్రారంభించారు. ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ దవాఖానలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించగా, ముఖ్య అతిథిగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పాల్గొని ప్రారంభించారు. రక్తదాతలను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. జనగామ ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రారంభించారు. 75 మంది రక్తదానం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్ ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే రాజయ్య, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, కలెక్టర్ శివలింగయ్య పాల్గొన్నారు.
హనుమకొండ డీఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొని రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. సీపీ తరుణ్‌జోషి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. హసన్‌పర్తిలోని మిషన్ భగీరథ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించారు. సుమారు 300 మంది రక్తదానం చేశారు. పరకాలలోని సివిల్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనిత హాజరయ్యారు.
మామునూరులోని 4వ బెటాలియన్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, కమాండెంట్ శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోనిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి దయాకర్‌రావు, గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారా ణితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ గోపి, దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు. నర్సంపేటలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు.
– నమస్తే నెట్వర్క్