దేవరుప్పుల, ఆగస్టు 8. వానలు పుష్కలంగా కురిసి చెరువులు నిండి వాగులు పారుతూ భూగర్భజలాలు ఉబికి వస్తుండడంతో రైతులు గుంట భూమిని కూడా వదలకుండా వరి నాట్లు వేస్తున్నారు. అందరూ ఒకేసారి నాట్లకు ఉపక్రమించడంతో స్థానికంగా కూలీలు దొరకడం లేదు. రోజుల తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఉండడంతో పాటు కూలీలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మహిళా కూలీలు ఎకరానికి రూ.6వేలు తీసుకుంటున్నారు. నారు అందించేందుకు మగ కూలీలకు అదనంగా రూ.వెయ్యి నుంచి రెండు వేల దాకా అవుతున్నది. అంతేకాకుండా కూలీలను వ్యవసాయ క్షేత్రాలకు తీసుకొచ్చేందుకు వాహనాల ఖర్చు, పని అయిపోయి తర్వాత మర్యాదలు కలిపి ఖర్చు పది వేలు దాటుతున్నది. దీంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.
ఉత్తరాఖండ్ కూలీల రాకతో ఊరట
ఈ పరిస్థితిని అధిగమించేందుకు కొందరు రైతులు కలిసి ఉత్తరాఖండ్ నుంచి కూలీలను రప్పించారు. దేవరుప్పులకు చెందిన రైతు లొడంగి శ్రీనివాస్ కూలీల కొరత కారణంగా 10 రోజులుగా నాట్లు వాయిదా పడ్డాయి. అతనికి ఉత్తరాఖండ్ కూలీల జాడ దొరకడంతో వారిని రప్పించాడు. 21మంది మగ కూలీలు రాగా వారికి కొత్తవాడలోని యాదవ కల్యాణ మండపంలో ఆశ్రయం కల్పించాడు. వీళ్లు రోజుకు దాదాపు నాలుగెకరాల్లో నాట్లు వేస్తున్నారు. ఎకరానికి రూ.6వేలు తీసుకుని నీరు పీకి, నారు పంచడంతో పాటు నాట్లు వేస్తున్నారు. జపాన్ పద్ధతిన తాడుతో సాలుగా నాట్లు వేసి ఆకర్షిస్తున్నారు. ఈ పద్ధతిలో నాట్లు వేస్తే చేనుకు రోగాల బెడద ఉండదని, దోమ పోటును నివారించవచ్చని రైతులు అంటున్నారు. మరోవైపు గాలి, వెలుతురు మొక్కల అడుగు వరకు తాకి ఏపుగా పెరిగి పిలకలు ఎక్కువ వస్తాయని చెబుతున్నారు.
స్థానికంగా కూలీలు దొరకడం లేదు
వరి సాగులో నాట్లు అధిక వ్యయంతో కూడుకున్నవి. పైగా సమయం దాటి పోతున్నది. అందరు రైతులు ఒకేసారి నాట్లు వేస్తుండడంతో స్థానికంగా మహిళా కూలీలు దొరకడం లేదు. ఆరా తీస్తే ఉత్తరాఖండ్ కూలీలు దొరికారు. రెండు రోజుల్లో మా పొలంలో నాట్లు వేశారు. హైదరాబాద్లో నేను కూలీ పనులు చేస్తున్న సమయంలో వీరు పరిచయమయ్యారు. హైదరాబాద్ నుంచి వీరిని రప్పించాను. పని త్వరగా చేస్తారు. వరుస క్రమంలో నాట్లేస్తారు. అన్ని పనులూ వాళ్లే చేసుకుంటారు. ఉండడానికి చోటు కల్పిస్తే ఎన్ని రోజులైనా పనిచేస్తారు.
– లొడంగి శ్రీనివాస్, కొత్తవాడ
మా దగ్గర పనుల్లేవు
మాది వెనుకబడ్డ ప్రాంతం. అక్కడ కూలీ పనులు చేసుకుందామంటే దొరకడం లేదు. బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చినం. తెలంగాణలో పనులు పుష్కలంగా ఉంటయ్. ఇక్కడ డబ్బు సంపాదించి పండుగలకు ఇండ్లకు పోతం. అక్కడ చేసిన అప్పులు కట్టుకుంటం. దేవరుప్పులలో నాట్లు వేసేది ఉందని తెలిసి వచ్చినం. నెలరోజులైనా ఉండి నాట్లు వేస్తం. కూలీ కూడా గిట్టుబాటవుతుంది. రైతులే వసతి కల్పించారు. ఇక్కడి ప్రభుత్వం చేస్తున్న పనులతోటి ఈ ప్రాంతంలో నీళ్లు పుష్కలంగా ఉంటున్నయ్. అందుకే రైతులందరూ భూముల్లో వరి పండిస్తున్నరు. ఇక్కడ వ్యవసాయంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధిలో ఉన్నయ్.
– విశాల్, వలస కూలీ, ఉత్తరాఖండ్