పోచమ్మమైదాన్, ఆగస్టు 4: వరంగల్ తహసీల్దార్ కార్యాలయ స్థలంలో రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ (ఆర్డీవో ), తహసీల్దార్ కార్యాలయాల నూతన భవనాలు నిర్మించనున్నారు. ఈ మేరకు రెండు కార్యాలయాలకు సంబంధించిన ప్రతిపాదనలను కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపారు. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్.. వరంగల్, హనుమకొండ జిల్లాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాకు సంబంధించిన జిల్లా కార్యాలయాలు హనుమకొండలో ఉండడంతో అక్కడి నుంచే పాలన కొనసాగుతోంది. అయితే, వరంగల్ తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన స్థలం ప్రభుత్వానిది కావడంతో ఇక్కడే ఆర్డీవోతో పాటు తహసీల్దార్ కార్యాలయాలకు నూతనంగా భవన నిర్మాణాలు చేపట్టాలని అధికారులు ఆలోచన చేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న 24 గుంటల విశాలమైన స్థలంలో రెండు ప్రభుత్వ కార్యాలయాలకు నూతన భవనాలు చేపట్టాలని ప్రతిపాదనలు పంపారు. అలాగే, ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాలయం భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భవనం పూర్తిగా తడిసిపోసింది. ఎక్కడ కూలుతుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీవో పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ కార్యాలయం కోసం ఇతర ప్రాంతాల్లో భవనాలను పరిశీలిస్తున్నారు. ఇటీవల ఆర్డీవో మహేందర్జీ కూడా పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ పరిసర ప్రాంతాల్లో అనువైన భవనం కోసం గాలిస్తున్నారు.