రాయపర్తి/పర్వతగిరి, జూలై 27 : రాష్ట్రంలోని ప్రతి ఊరిని ఎల్ఈడీ వెలుగులతో నింపేందుకు చర్యలు చేపట్టామని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఈఈఎస్ఎల్ నేతృత్వంలో ప్రయోగాత్మకంగా రాయపర్తి, పర్వతగిరి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధిలైట్లను ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ముందుగా రాయపర్తిలో సర్పంచ్ గారె నర్సయ్య అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ కొత్త ఎల్ఈడీ లైట్ల నిర్వహణ ఖర్చు తక్కువ ఉంటుందని, కరెంట్ బిల్లు చాలామట్టుకు ఆదా ఆదా అవుతుందన్నారు.
పంచాయతీలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాల గుండెల్లో గుబులు రగులుతున్నదన్నారు. గతంలో రాష్ర్టాన్ని పాలించిన నాయకులంతా ప్రజా సంక్షేమాన్ని, సమస్యలను గాలికి వదిలి తమ ఆస్తులను కూడబెట్టుకునేందుకు, అనుచరులకు పదవులు కట్టబెట్టుకునేందుకే పాకులాడేవారని విమర్శించారు.
రాష్ట్రంలో ప్రజలందరూ సీఎం కేసీఆర్ పరిపాలనతో ప్రభుత్వ ఫలాలను అందుకుంటుంటే బీజేపీ, కాంగ్రెస్‌లకు మతులు భ్రమిస్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడడమే లక్ష్యంగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమను ఒలకబోస్తున్న కేంద్రంలోని బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. పర్వతగిరిలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా జీపీలకు కేంద్రంతో సంబంధం లేకుండా రూ. 250 కోట్లు కేటాయిస్తున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న హరితహారం వల్లే నేడు వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయని గుర్తుచేశారు. గ్రామీణ వ్యవస్థ బాగా పని చేయడం వల్లే కరోనా లాంటి సమస్యలను అధిగమించామని, సర్పంచ్ మొదలు కార్యదర్శి, పారిశుధ్య కార్మికులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు బాగా పని చేసి కరోనాను అరికట్టారని అభినందించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ నిధుల కేటాయింపులో వరంగల్‌కు సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తారని చెప్పారు. ఇంటింటికి గోదావరి నీటిని అందిస్తున్న మహనీయుడు మన ముఖ్యమంత్రి అని కొనియాడారు.
కార్యక్రమాల్లో టీఎస్ రెడ్కో వీసీ అండ్ ఎండీ జానయ్య, పీఆర్ డిప్యూటీ కమిషనర్ పీ రవీందర్, రాయపర్తి ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, అదనపు కలెక్టర్ బానోతు హరిసింగ్, ఈఈఎస్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్ ద్వివేది, ఆపరేషన్స్ హెడ్ అనిల్కుమార్చౌదరి, సౌత్, ఈస్ట్ క్లస్టర్ హెడ్ సావిత్రీ సింగ్, జడ్పీ సీఈవో రాజారావు, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు, డీపీవో నాగపురి స్వరూపారాణి, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మునావత్ నర్సింహనాయక్, ఎంపీడీవో గుగులోతు కిషన్‌నాయక్, ఎంపీవో తుల రాంమోహన్, పంచాయతీ కార్యదర్శులు గుగులోతు అశోక్‌నాయక్, బెట్టపల్లి రాకేశ్, బత్తుల నర్సయ్య, పెంచల విజేందర్, ఎంపీటీసీలు బిల్ల రాధిక సుభాష్‌రెడ్డి, అయిత రాంచందర్, పర్వతగిరిలో జడ్పీటీసీ సింగ్‌లాల్, ఎంపీపీ కమల పంతులు, సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, బొట్ల మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.