కరీమాబాద్, జూలై 27 : ఓ వ్యక్తికి మద్యం తా గించి అతడి వద్ద నుంచి రూ.లక్షా 99 వేలు అపహరించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్ ఏసీపీ గిరికుమార్ బుధవారం మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పాలకుర్తి మండ లం గూడూరు గ్రామానికి చెందిన లొంక ఐలయ్య ఈ నెల 19న తన భూమి అమ్మగా వచ్చిన రూ.లక్షా 99 వేలతో ఇంటికి వెళ్లేందుకు వరంగల్ బస్టాండ్ వద్ద ఆటో ఎక్కాడు.
అందులో తొలుత ఇద్దరు ఆడవారు, కొద్ది దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు మగవారు ఎక్కారు. వారు బాధితుడిని నమ్మించి అతడి తో మద్యం తాగించారు. అతడు మత్తులోకి జారుకున్నాక, ఇసుక అడ్డా జంక్షన్ వద్ద అతడి వద్ద ఉన్న నగదుతో పాటు సెల్‌ఫోన్ దొంగలించారు. ఐలయ్యకు తెల్లారి మెలకువ వచ్చి చూసుకునేసరికి నగదు, సెల్‌ఫోన్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ. లక్షా15 వేల నగదు, ద్విచక్ర వాహనం స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎస్సై రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
చోరీ కేసులో మరో నిందితుడు..
గిర్మాజీపేట, జూలై 27 : చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి 5 తులాల బంగారం, రూ. 10 వేల నగదును రికవరీ చేశారు. ఇంతేజార్గంజ్ సీఐ మల్లేశ్ తెలిపిన వివరాల ప్రకారం… కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన ప్రైవేట్ లెక్చరర్ గుండేటి రజిని ఇంటిలో గిర్మాజీపేటకు చెందిన ఎలగంటి గణేశ్ అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 22న ఇంటి యజమాని, కుటుంబసభ్యులు ఇంట్లో లేరని గమనించి నకిలీ తాళం చెవితో లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న 5 తులాల బంగారు ఆభరణాలు, రూ. 35 వేల నగదు అపహరించారు. క్రైమ్ టీం సిబ్బంది శివకృష్ణ, ఉపేందర్, శశికుమార్, సంతోష్, రాంరెడ్డి సహకారంతో బుధవారం ఉదయం వరంగల్చౌరస్తాలో గణేశ్‌ను అదుపులోకి తీసుకొని 5 తులాల ఆభరణాలు, రూ. 10 వేల నగదును రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న ఎస్సై సిద్దోజు కిరణ్మయి, క్రైమ్ టీం సిబ్బందిని ఏసీపీ గిరికుమార్, సీఐ అభినందించారు.
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత..
పర్వతగిరి మండంలోని ఇస్లావత్‌తండా గ్రామపంచాయతీకి చెందిన బాలుడు రాజ్‌కుమార్ వరంగల్ బస్టాండ్ ప్రాంతంలో ఉన్నాడని డయల్ 100కి ఫోన్ వచ్చింది. వెంటనే స్పందించిన బ్లూకోల్ట్ సిబ్బంది అక్కడకు వెళ్లి బాలుడిని గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.