సుబేదారి, జూలై 22: ప్రణాళిక, పట్టుదలతో చదివితేనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా దాస్యం రంగశీల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారి ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు శుక్రవారం ఉచితంగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బుర్రా వెంకటేశం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్య హాజరయ్యారు. అభ్యర్థులకు మెటీరియల్ అందించిన అనంతరం బుర్రా వెంకటేశం మాట్లాడారు.
చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ యువతకు మూడు నెలలుగా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో ఉచితంగా కోచింగ్ ఇప్పించి, స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తే వినయ్‌భాస్కర్ ఎంతో సంతోష పడుతారని అన్నారు. సమయాన్ని వృథా చేయకూడదని అభ్యర్థులకు సూచించారు. వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా దాస్యం రంగశీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ఉచిత కోచింగ్ ఇచ్చినట్లు తెలిపారు.
తెలుగు, ఇంగ్లిష్‌లో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్ కూడా అందించినట్లు వివరించారు. అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య మాట్లాడుతూ అన్నదానం, విద్యా దానం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ యువతకు ఉచిత కోచింగ్‌తో మంచి అవకాశాన్ని కల్పించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్, జాగృతి ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, కేయూ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు పుల్లా శ్రీనివాస్, విన్నర్స్ అకాడమీ డైరెక్టర్ రాజిరెడ్డి, అన్వర్, కార్పొరేటర్లు సోదా కిరణ్, రాంప్రసాద్, మామిండ్ల రాజు, వీరేందర్ పాల్గొన్నారు.
ఆలోచనలకు పదును పెట్టాలి
హనుమకొండ సిటీ : ఆలోచనలకు పదునుపెట్టి ఆచరణలోకి తెచ్చినప్పుడు విజయం వరిస్తుందని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ పొందుతున్న గ్రూప్-1, ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శుక్రవారం ఆయన స్టడీ మెటీరియల్ పంపిణి చేశారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ పేదరికాన్ని శాపంగా భావించకుండా లక్ష్యం కోసం ప్రయత్నించాలని సూచించారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నాణ్యమైన కోచింగ్ అందిస్తుందన్నారు. చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బీసీ స్టడీ సర్కిళ్లను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలిపారు.
బుర్రా వెంకటేశం రాసిన సెల్ఫీ ఆఫ్ సక్సెస్ పుస్తకాన్ని విద్యార్థులు చదవాలని సూచించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కుమ్మరి మాస్టర్ ట్రైనర్స్‌కు మట్టి పాత్రలు తయారు చేసే యంత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీరాంరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాల అభివృద్ధి అధికారులు లక్ష్మణ్, శైలజ, శంకర్‌నాయక్, అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ కందాల శంకరయ్య, హాస్టల్ వార్డెన్లు రవికుమార్, వెంకట్రాజం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ సూత్రపు అనిల్‌కుమార్ ల్గొన్నారు.