పద్యాన్నే పదునైన ఆయుధంగా చేసుకొని.. తెలంగాణ ప్రజల కన్నీళ్లనే ‘అగ్నిధార’గా మలిచి.. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించి.. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించి.. ఇప్పటికీ ఎందరికో ప్రేరణనందిస్తున్న కవి సార్వభౌముడు దాశరథి కృష్ణమాచార్య. ఎన్నో పద్యాలు, గేయాలు, కథలు, నాటికలు, కవితలు, నవలలు రచించి సాహితీ రంగంలో చెరగని ముద్రవేసుకున్నారు. తన పాటలతోఎందరినో ఓలలాడించి తెలుగు సినీ సాహిత్యానికే తిరుగులేని మకుటమై నిలిచారు. నేడు ఆయన జయంతి సందర్భంగా ఉమ్మడి జిల్లావాసులు దాశరథి రచనలను యాదిచేసుకుంటున్నారు.
– చిన్నగూడూరు, జూలై 21
దాశరథి కృష్ణామాచార్య 1925 జూలై 22న ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరుకు చెందిన వెంకటాచార్యులు-వెంకటమ్మ దంపతులకు జన్మించారు. ఆయన బాల్యమంతా ఖమ్మం జిల్లా మధిరలో గడిచింది. ఉర్దూలో మెట్రిక్యులేషన్ను, భోపాల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్మీడియెట్, ఉస్మానియా విశ్వ విద్యాలయం నుంచి ఇంగ్లిష్ సాహిత్యంలో బీఏ చేశారు. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూలో మంచి పండితుడు. చిన్నతనంలోనే పద్యం అల్లడంలో ప్రావీణ్యుడు. మొదట్లో కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా ఉండి, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆ పార్టీ వైఖరి నచ్చక బయటకు వచ్చి ‘హైదరాబాద్ సంస్థానంలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పాలు పంచుకున్నారు. ఉపాధ్యాయుడిగా, పంచాయతీ ఇన్స్పెక్టర్గా, ఆకాశవాణి ప్రయోక్తగా పనిచేశాడు. నిజాం పాలనలో హింసననుభవిస్తున్న తెలంగాణను చూసి చలించిపోయాడు. పీడిత ప్రజల గొంతుగా మారి నినదించాడు. ‘రైతుదే తెలంగాణము రైతుదే. దిగిపోవోయ్.. తెగిపోవోయ్’ అని నిజామును సూటిగా గద్దిస్తూ రచనలు చేశాడు.
ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైన పాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం చేత జైలు శిక్ష అనుభవించాడు. నిజామాబాద్‌లోని ఇందూరు కోట లో ఆయనను మరో 150మందితో ఖైదు చేసి ఉం చింది నిజాం ప్రభుత్వం. ఆయనతో పాటు ఖైదులో వట్టికోట ఆళ్వారుస్వామి కూడా ఉన్నారు. పళ్లు తోముకోవడానికి వచ్చే బొగ్గుతో జైలు గోడల మీద పద్యాలు రాసి దెబ్బలు తిన్నాడు. భావ ప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్మాతల్లో ఒకరు. 1953లో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి అధ్యక్షుడిగా జిల్లాల్లో సాహితీ చైతన్యాన్ని నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగస్టు 15 నుంచి 1983 వరకు పనిచేశాడు. కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీ బహుమతులు అందుకున్నాడు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానులను సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి ‘గాలిబ్ గీతాలు’ పేర అనువదించాడు. తల్లి మీద, తల్లి తెలంగాణమీద ఆయన రచించిన పద్యాలు ఇప్పటికీ ఎందరికో ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి.
సినీ వినీలాకాశంలో..
1961లో ఇద్దరు మిత్రులు సినిమాలో పాటలు రాయడంతో ఆయన సినీరంగ ప్రవేశం చేశాడు. కొన్ని వందల పాటలను రచించి తెలుగు సినీ సాహిత్యానికి సేవ చేశారు. ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో ఆయన రాసిన ‘ఖుషీ ఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’.. వాగ్దానంలో ‘నా కంటిపాపలో నిలిచిపోరా.. నీవెంట లోకాల గెలవనీరా’.. దాగుడు మూతలు సినిమాలో ‘గోరంక గూటికే చేరావు చిలకా.. గోరొంకకెందుకో కొండంత అలక.. మూగమనసులు సినిమాలో ‘గోదారీ గట్టుందీ.. గట్టుమీద సెట్టుందీ.. సెట్టుకొమ్మన పిట్టుందీ.. పిట్ట మనసులో ఏముందీ?.. బంగారు గాజులు సినిమాలో ‘విన్నవించుకోనా చిన్నకోరిక.. ఇన్నాళ్లూ నా మదిలో ఉన్న కోరికా..’ రాములో ‘రారా కృష్ణయ్య.. రారా కృష్ణయ్యా దీనులను కాపాడ రారా కృష్ణయ్య’.. మాతృ దేవతలో ‘మనసే కోవెలగా.. మమతలు మల్లెలుగా” పాటలు ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంటాయి.
స్వగ్రామంలో జయంతి ఏర్పాట్లు
చిన్నగూడూరులో నేడు దాశరథి జయంతి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రముఖ కవులు, గాయకులు, రాజకీయ ప్రముఖులు, వివిధ సంఘాల బాధ్యులు హాజరుకానున్నారు. సమైక్య విద్యా సంస్థల ఆధినేత అడ్డగోడ నరేశ్, స్థానికుల ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా దాశరథి సోదరులు కృష్ణమాచార్యులు, రంగాచార్యుల విగ్రహాలను చిన్నగూడూరులో ఏర్పాటు చేశారు. దాశరథి సోదరులు జన్మించిన చిన్నగూడూరు మండల కేంద్రానికి దాశరథి పేరు పెట్టాలని, హైదరాబాద్‌లోని టాంక్‌బండ్‌పై ఇద్దరి విగ్రహాలను ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు.
కవితా సంపుటాలు
అగ్నిధార, మహాంధ్రోదయం
రుద్రవీణ, మార్పు నా తీర్పు
ఆలోచనాలోచనాలు
ధ్వజమెత్తిన ప్రజ
కవితా పుష్పకం
తిమిరంతో సమరం
నేత్ర పర్వం, పునర్ణవం
గాలిబ్ గీతాలు
బిరుదులు
కవి సింహం
అభ్యుదయ కవితా చక్రవర్తి
ఆంధ్రకవితా సారథి
అవార్డులు
1967లో కవితా పుస్తకం సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు.
1974లో తిమిరంలో సమరం రచనకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు.
1976లో ఆగ్రా విశ్వ విద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ లెటర్స్ బిరుదుతో సత్కారం
1977లో ఆంధ్ర ప్రదేశ్ ఆస్థానకవిగా పదవి అలంకరణ
1975లో ఆంధ్రా విశ్వవిద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కారం. ఇలా ఎన్నో బిరుదులు, సత్కారాలను దాశరథి అందుకున్నారు.
‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో!
ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో!!
భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో!
ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో!
ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో!!
‘ఓ నిజాము పిశాచమా, కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని
తీగలను తెంపి అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటి రతనాల వీణ’
ఉదయాద్రి భుజమెక్కి ఒకడు నవ్వెను చూడు
భూ దివమ్ములు వెల్గుపూలు పూయ!
ఉవిద తామరబుగ్గ నెవడో ముద్దిడె చూడు
మనసులో వలపు చందనము రాయ!
చిమ్మచీకటి కాలజిమ్మెనెవ్వడొ చూడు
గుండెలోపలి తమోగుణము మాయ!
కనురెప్ప దుప్పటీ కప్పులాగె నెవండో
వెలుగు లోకాలు తల్పులను తీయ!
ఉండడానికో సౌధం ఉండక పోయినాగానీ
ఆశాసౌధాన్నైనా అధిరోహిస్తే తప్పా!
నా ఆశాసౌధం గోడలు..
నరులే! దానవులు కారు
నా ఆశాసౌధం నీడలు
నావే! నరపతులవి కావు
తెరలు తెరలుగా చీకటి! దిగెను జగతి నడినెత్తిని!
ఎంతని ముట్టించగలను! ఈ దీపపు చిరువత్తిని!
ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!
ఎవరు రాయలు! ఎవరు సింగన!
అంతానేనే! అన్నీ నేనే!
అలుగు నేనే ! పులుగు నేనే!
వెలుగు నేనే ! తెలుగు నేనే !
– దాశరథి కృష్ణమాచార్య రచనల్లో కొన్ని..