ఖిలావరంగల్, జూలై 18: నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసేదే ఇంటింటా ఇన్నోవేటర్-2022 అని వరంగల్ అదనపు కలెక్టర్లు శ్రీవత్స కోట, బీ హరిసింగ్ అన్నారు. వరంగల్ కలెక్టరేట్లో ఇంటింటా ఇన్నోవేటర్-2022 వాల్ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పౌరులు, విద్యార్థులు, చిన్నతరహా, కుటీర, అంకుర పరిశ్రమల నిర్వాహకులు, వ్యవసాయదారులు, గృహిణులు, సాధారణ ప్రజల నుంచి నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వినూత్న పరిష్కారం కొనుగొనేలా ఆవిష్కరణలు చేసి ఉంటే ఇన్నోవేటర్ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చన్నారు. గత ఏడాది వరంగల్ జిల్లా నుంచే అత్యధిక నామినేషన్లు పంపి మొదటి స్థానంలో నిలిచామన్నారు.
ఈ ఏడాది కూడా రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ వారు జిల్లాలోని అన్ని రంగాల్లోని ప్రజల నుంచి వాట్సాప్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీవో, డీపీఆర్వో, డీపీవో, డీఏవో, డీడబ్ల్యూవో, ఈడీఎం, డీవైఎస్వో, డీఐఈవో, ఎన్‌వైకే విభాగాల అధికారులు తమ పరిధిలోని ఇన్నోవేటర్లను గుర్తించి, వారిని ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమానికి నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు. డీఈవో వాసంతి మాట్లాడుతూ ఇంటింటా ఇన్నోవేటర్‌లో పాల్గొనేందుకు అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అర్హులన్నారు. అన్ని స్థాయిలోని విద్యార్థుల ఆవిష్కరణలను ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవాలన్నారు.
ఆవిష్కర్త తన పేరు, వయసు, వృత్తి, గ్రామం జిల్లా పేరుతోపాటు ఆవిష్కర్త వివరణ ఆరు వ్యాఖ్యాలు, ఆవిష్కరణకు సంబంధించిన నాలుగు చిత్రాలు, ఆవిష్కరణకు సంబంధించిన రెండు నిమిషాల వీడియోను 91006 78543 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన ఆవిష్కరణలను ఆగస్టు 15న జిల్లాలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో వాటిని ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. వివరాల కోసం జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కే శ్రీనివాస్ 98488 78455 నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఏ సంపత్‌రావు, డీపీవో స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.