ఆత్మకూరు, జూలై 17: కటాక్షపురం పెద్ద చెరువు బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. భద్రాచలంలోని ముంపు ప్రాంతాలను స్వయంగా పరిశీలించడానికి ఆదివారం హనుమకొండ జిల్లా నుంచి రోడ్డు మార్గంలో కాన్వాయ్‌లో వెళ్లారు. ఈ సందర్భంగా ఆత్మకూరు జాతీయ రహదారిపై ఉన్న కటాక్షపురం పెద్ద చెరువును, మత్తడిని కాన్వాయ్ నుంచి ఆయన పరిశీలించారు. కాన్వాయ్‌లో కూర్చున్న సీఎం పక్కన ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఈ రహదారి వెంట వెళ్తుండగా ఈ చెరువులో సుమారు 1000 మంది చేపలు పట్టారని చెప్పారు. అంతేకాకుండా ఆ సమయంలో జై తెలంగాణ, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాగా, చెరువు మత్తడి పడుతుండగా కాన్వాయ్ డ్రైవర్ స్పీడ్ తగ్గించడంతో సీఎం అందులో నుంచి చెరువును, మత్తడి పోస్తున్న తీరును పరిశీలించారు. అలాగే, సీఎం వస్తున్న సమాచారం తెలుసుకున్న సర్పంచ్ దంపతులు రబియాబీ, హుస్సేన్, గూడెప్పాడ్, ఆత్మకూరు, హౌసుబుజుర్గు, కటాక్షపురం తదితర గ్రామాల అభిమానులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అభివాదం చేశారు.