పోచమ్మమైదాన్, జూలై 15: కరోనా బూస్టర్ డోస్ టీకాల పంపిణీ కార్యక్రమం శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైంది. ఇందులో వరంగల్ దేశాయిపేటలోని అర్బన్ హెల్త్ సెంటర్లో 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేశారు. దేశాయిపేటలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన యువతీ యువకులకు వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం సెంటర్లో అందుబాటులో ఉన్న కొవాక్సిన్ వేశామని, కోవిషీల్డ్ వచ్చిన తర్వాత ఈ డోస్ కూడా వేస్తామని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది కోర్నెలు, జ్యోతి, నిహారిక, అనిల్, కుమార్, సరస్వతి పాల్గొన్నారు.
అర్హులందరికీ వ్యాక్సిన్..
సంగెం: అర్హులైన వారందరికీ కరోనా బూస్టర్ డోస్ ఇవ్వనున్నట్లు సంగెం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి పొగాకుల అశోక్ తెలిపారు. సంగెం పీహెచ్సీలో ఆయన టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండి కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకొని ఆరు నెలలు పూర్తయిన వారందరికీ బూస్టర్ డోస్ ఇస్తామన్నారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నందున అర్హులు వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని కోరారు. దోమల నుంచి రక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
సమన్వయంతో విజయవంతం చేయాలి
గిర్మాజీపేట: స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు ప్రజలను చైతన్యం చేస్తూ కరోనా బూస్టర్ డోస్ ప్రక్రియను విజయవంతం చేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్ కే వెంకటరమణ పిలుపునిచ్చారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ కొవిడ్ ప్రికాషనరీ డోస్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, నర్సంపేట, వర్ధన్నపేట సీఎచ్సీల్లో వ్యాక్సిన్‌ను సిద్ధం చేశామని చెప్పారు. ఈ మేరకు ఆయన రంగశాయిపేట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మొదటి రోజు జిల్లాలో 206 మందికి ప్రికాషనరీ డోస్ వేసినట్లు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు.