హనుమకొండ సబర్బన్, జూలై 13: జిల్లాలో భారీ వర్షం ఐదో రోజూ కొనసాగింది. శనివారం మొదలు కాగా ఐదు రోజులుగా కురుస్తూనే ఉంది. జిల్లాలోని అన్ని మండలాల్లో ముసురు పట్టింది. పరకాల, శాయంపేట, ఆత్మకూరు మండలాలపైనే ఎక్కువగా ప్రభావం కనిపించింది. బుధవారం శాయంపేటలో 10.3 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. కమలాపూర్‌లో 8.5 సెంటీమీటర్లు పడగా, ఆత్మకూర్‌లో 7.3, పరాలలో 6.7, ఎల్కతుర్తిలో 6.1 సెంటీమీటర్ల వర్షం పడింది. అత్యల్పంగా ఐనవోలులో 2.5, ధర్మసాగర్లో 3.2 సెంటీమీటర్లు పడింది. జిల్లాలో సరాసరిగా 5.4 సెంటీమీటర్లు కురిసింది. జిలాల్లో ఇప్పటివరకు 24.7 సెంటీమీటర్లకు గాను అత్యధికంగా 48.2 సెంటీమీటర్ల వాన నమోదైంది. చెరువుల్లోకి ఇప్పుడిప్పుడే నీరు చేరుతోంది. చిన్నచిన్న కుంటలు పూర్తిగా నిండే అవకాశాలు న్నాయి.
కాజీపేట: కాజీపేట పట్టణం ముసురు వర్షానికి బుధవారం జలమయమైంది. పలు కాలనీలు నీట మునిగిపోయాయి. జనజీవనం స్తంభించింది. మురుసుతో చిరువ్యాపారులు, వర్తక వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారడంతో వివిధ పనులపై బయటికి వెళ్లు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలైన బాపూజీనగర్, ఇంపీరియల్ కాలనీ, బూడిదగడ్డ, రైల్వేకాలనీ, వైఎస్సాఆర్ నగర్, విష్ణుపురి మహాంకాళీ దేవాలయ ప్రాంతంతోపాటు తదితర ప్రాంతాలు జలాశయాలుగా మారాయి. పట్టణంలోని సోమిడి చెరువు నిండి మత్తడి పోస్తుండడంతో సుబ్బయ్యపల్లి, ఆపై ప్రాంతాల నుంచి సోమిడి మీదుగా కాజీపేటకు రాకపోకలు సాగించేవారు నీటిని దాటుకు వెళ్తున్నారు. వర్షం కారణంగా కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడచే పలు ప్రయాణీకుల రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి.
ఎల్కతుర్తి: వర్షం మంగళవారం సాయంత్రం మొదలై బుధవారం వరకు కురుస్తూనే ఉంది. దీంతో ప్రజలు తమ ఇళ్లకే పరిమితమయ్యారు. వానకాలం సీజన్ ఆరంభంలో రైతులు విత్తిన పత్తి విత్తనాలు మొలకెత్తే దశలో ఉన్నాయి ముసురుతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లోకి 70శాతం వరకు మేర వర్షపు నీళ్లు చేరాయి. ముసురు ఇలాగే కొనసాగితే ఒకటి, రెండు రోజుల్లో కుంటలు మత్తడులు పడడంతోపాటు చెరువులు నిండే అవకాశాలున్నాయి. కాగా తీవ్ర ముసురు నేపథ్యంలో ఎంపీడీ వో తూర్పాటి సునీత, ఎస్సై జక్కుల పరమేశ్ ఆయా గ్రామాల సర్పంచ్‌లను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
దామెర: మండలంలో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. చెరువులు, కుంటలు నిండు కుండల్లా మారాయి. పలు గ్రామాల్లోని వరదనీటి కాలువలు పొంగి ప్రవహిస్తుండగా పులుకూర్తి గ్రామానికి వెళ్లే లోలెవల్ బ్రిడ్జిగుండా అధికంగా నీరు ప్రవహిస్తుండడంతో అధికారులు ప్రజలను, వాహనదారులను అప్రమత్తం చేశారు. కోగిల్వాయిలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండవద్దని సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రజలకు సూచించారు.
ఆత్మకూరు : జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న కటాక్షపురం చెరువు నిండుకుండలా మారింది. 18ఫీట్లవరకు నీళ్లు వస్తే చెరువు మత్తడిపడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 15ఫీట్ల వరకు నీళ్లు వచ్చాయని తహసీల్దార్ సురేశ్‌కుమార్ తెలిపారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను బయటకి పంపిస్తున్నారు. జాతీయ రహదారిపై పెద్ద చెట్టు పడిపోయింది. స్పందించిన ఎస్సై ప్రసాద్, పోలీస్ సిబ్బందితో కలిసి వెళ్లి చెట్టును తొలగించారు. వాహనాలకు ఇబ్బందులు కలుకుండా చర్యలు తీసుకున్నారు.
కంఠాత్మకూరు బ్రిడ్జిపై వరద నీరు
నడికూడ : అధిక వర్షాల వల్ల కంఠాత్మకూరు శివారులోని లోలెవల్ వంతెన పైకి వరద నీరు ప్రవహిస్తున్నది. బుధవారం దామెర ఎస్సై హరిప్రియ వంతెనపై నిలిచిన గుర్రపు డెక్క, తుంగను జేసీబీ సాయంతో తీయించి వరద నీరు ప్రవహించేలా చేశారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నందున వాహనాల రాకపోకలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరో మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వాహనదారులు లోలెవెల్ వంతెన నుంచి పోవడానికి సాహసం చేయవద్దని అది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. పోలీసు, రెవెన్యూ సిబ్బంది, కారోబార్ రమేశ్, గుడికందుల శివ పాల్గొన్నారు.
పరకాల: వర్షాలతో పట్టణంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పట్టణంలోని నూతన మున్సిపాలిటీ రోడ్డులో ఉన్న జర్నలిస్టు కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. కాలనీలోకి భారీగా వరద నీరు చేరుకుని రాకపోకలు నిలిచాయి. కాగా, ఇటీవల నాయకువని కుంటపై నూతన బీటీ రోడ్డు వేశారు. ఈ క్రమంలో కుంట కట్ట రెండు ఫీట్ల ఎత్తు పెరుగగా కుంటలో నుంచి నీరు బయటికి వెళ్లేందుకు మున్సిపల్ అధికారులు అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. కుంట చుట్టు ఉన్న పంట పొలాలు నీట మునిగాయి. కాగా మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి కాలనీలో పర్యటించారు. కుంటలో నుంచి వరద నీరు పోయే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
22 అడుగులకు చేరిన చలివాగు
శాయంపేట: ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో జనజీవనం స్తంభించింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. చెరువులన్నీ నిండుకుండలా మారాయి. ఆర్ఐ లావుడియా హేమనాయక్ మండలంలోని గట్ల కనపర్తి, సూరంపేట, తహరపూర్, శాయంపేట, మైలారం, జోగంపల్లి, పత్తిపాక గ్రామాలను సందర్శించారు. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టులో నీటిమట్టం 22 అడుగులకు చేరి కళకళలాడుతోంది. చలి వాగు ప్రాజెక్టును హేమనాయక్ పరిశీలించి పరిస్థితిని తెలుసుకున్నారు. కొప్పుల శివారులో దిగువన ప్రాజెక్టు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రాకపోకలు నిలిపివేసినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నేరేడుపల్లిలో 4, శాయంపేట గ్రామం లో ఒక ఇల్లు వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మండలంలోని సూరంపేట, మాందారి పేట మధ్య కాజు వే పై వాగు ఉధృతితో వరద పెరిగి రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
కమలాపూర్ : మండలంలోని గూనిపర్తి -కంఠాత్మకూరు గ్రామాల మధ్య ఉన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాలను సీఐ సంజీవ్ బుధవారం దారిమళ్లించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హనుమకొండ-పరకాల ప్రధాన రహదారిపై ఉన్న కంఠాత్మకూరు వాగు రోడ్డుపై నుంచి ప్రహహిస్తోంది. దీంతో శనిగరం మీదుగా పరకాలకు వాహనాలను దారిమళ్లించారు. వాగులు ప్రవహిస్తుండటంతో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. వంగపల్లి-మర్రిపెల్లిగూడెం రహదారిపై వర్షానికి చెట్లు కూలిపోవడంతో సీఐ సంఘటన స్థలానికి చేరుకుని చెట్లను తొలగించారు. అలాగే కన్నూరు-కమలాపూర్ రహదారిపై చెట్టు పడిపోవడంతో స్థానికుల సాయంతో చెట్టును తొలగించి రాకపోకలు కొనసాగించారు. వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.