హనుమకొండ చౌరస్తా, జూలై 13 : వర్షాలు తగ్గుముఖం పట్టి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని గురువారం రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో పూజలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలంగాణ రాష్ట్ర అర్చక సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం సీఎం కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడినట్లు ఆయన పేర్కొన్నారు. అపారమైన భక్తి విశ్వా సం కలిగిన సీఎం కేసీఆర్ ఎన్నో యాగాలు చేయడంతోనే వాగులు, చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా మారాయని వివరించారు. ఈ తరుణంలో వర్షాలు తగ్గుముఖం పట్టి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు చేయనున్నట్లు తెలిపారు. 12,200 దేవాలయాల్లో పూజలు జరిపించాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్‌ను ఆదేశించినట్లు చెప్పారు. 11 వేల సార్లు జపం, 1100 సార్లు హోమం చేయాలని చెప్పినట్లు వివరించారు. జపంతో వర్షం తగ్గుముఖం పట్టి రాష్ట్రమంతా సుభిక్షంగా ఉంటుందని గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోని అర్చకులు తప్పకుండా పూజలు చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు.