నమస్తే నెటవర్క్;వంట గ్యాస్ ధర పెంచినందుకు మోదీ సర్కారుపై ఓరుగల్లు భగ్గుమన్నది. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, మహిళలు ఖాళీ గ్యాస్ సిలిండర్లతో రోడ్లుపై నిరసన తెలిపారు. ఓ వైపు వర్షం పడుతున్నా మంట పెట్టి కట్టెల పొయ్యిల మీద వంటావార్పు చేశారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై కట్టెల పొయ్యి పెట్టగా ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కలిసి నిరసనలో పాల్గొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం అక్కడే చాయ్ తయారుచేసి అందరికీ అందజేశారు. పెంచిన వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించకుంటే ప్రధాని మోదీకి కూడా ఇలాగే ‘మంట’ పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎంపీ కవిత అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 170శాతం వంటగ్యాస్ ధరలను పెంచారని, వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలకేంద్రంలో తలపెట్టిన నిరసన కార్యక్రమంలో స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొని ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అలాగే జనగామ జిల్లాలో నిరసనలతో హోరెత్తించారు. జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి పాల్గొన్నారు.
–