గిర్మాజీపేట, జూలై 8: ఈ నెల 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ గోపాల్‌రావు పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో శుక్రవారం ఆయన వైద్యాధికారులతో సమీక్షించారు. జనాభా పెరుగుదల వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ప్రకాశ్ మాట్లాడుతూ జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ కొవిడ్ వ్యాక్సిన్ వేయాలన్నారు. వైద్యాధికారులు గర్భిణులు, పిల్లలకు ఇవ్వాల్సిన సార్వత్రిక వ్యాధి నిరోధక టీకాలను సమయానుకూలంగా ఇచ్చి, వారికి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఎన్వీబీ డీసీపీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చల్లా మధుసూదన్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని, ప్రజలకు డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా, చికెన్‌గున్యా, మెదడువాపు, విరేజనాలు, నీళ్ల విరేచనాలపై అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూచించారు. వ్యాధికి గురైన వారికి వెంటనే తగిన వైద్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక, పట్టణ, పల్లెదవాఖానల వైద్యాధికారులు, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.