కరీమాబాద్, జూలై 8: తెలంగాణ పండుగలకు ప్రతిరూపం బోనాలు. కొలిచే దేవుడు ఎవరైనా భక్తితో బోనమెత్తడం ఆచారం. కురుమల ఇలవేల్పు బీరన్న స్వామికి తాతల కాలం నుంచి అండర్ రైల్వేగేట్ ప్రాంతంలోని కురుమలు ఇష్టంగా తీరొక్క బోనాలతో మొక్కులు చెల్లించి సల్లంగ చూడాలని వేడుకుంటున్నారు. ఈ నెల 10న తొలి ఏకాదశి సందర్భంగా బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఉర్సులోని కురుమలు బీరన్నస్వామి ఆలయానికి ఉదయం ఆరు గంటలకు మరుపల్ల రవి ఇంటి నుంచి స్వామి వారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. అనంతరం ఇంట్లో బోనాలు చేసుకొని, మహిళలు నెత్తిన బోనమెత్తి కుటుంబ సమేతంగా కురుమడోలు వాయిద్యాల నడుమ బీరన్న ఆలయానికి తరలివెళ్తాము.
దారి పొడవునా బీరన్నల నృత్యాలు, విన్యాసాలు, ఒగ్గుకథలతో బీరన్నస్వామి ఆలయానికి వెళ్తారు. తర్వాత బోనాలన్నీ ఒక్కచోట చేర్చి స్వామి వారికి నైవేద్యం సమర్పిస్తారు. ఉన్ని కంకణాన్ని బండారిలో ముంచి పచ్చగా మారగానే చేతికి కట్టుకొని దైవదర్శనాన్ని చేసుకొని తిరిగి ఇళ్లకు తిరుగు పయనమవుతారు.
కరీమాబాద్‌లోని కురుమలు ఉదయం బీరన్న స్వామికి అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత కురుమ సంఘం నుంచి మూడు రంగుల జెండాను పురవీధుల గుండా తిప్పి ఆలయంలోని దైవ చెట్టుకు జెండాను కడుతారు. అనంతరం బీరన్నలు కురుమల డోలు కొడుతూ కురుమల గడపగడపకూ వెళ్లి బండారిని నుదట బొట్టుగా పెట్టి బోనాలు సిద్ధం చేయాలని సూచిస్తారు. మొదట రామస్వామి ఆలయం వద్ద కులపెద్దనెత్తిన బండారితో బోనాలతో నిలిచి ఉంటాడు. బీరన్నలు కురుమ డోలుతో తలోదిక్కుకు బయల్దేరి కురుమలను ఇంటి వద్ద నుంచి డోలు వాయిద్యాలతో తీసుకొస్తారు. ఇలా అంతా రామస్వామి గుడి వద్దకు చేరుకుంటారు. తర్వాత బీరన్న స్వామి బోనాలు బయల్దేరుతాయి. ఈ సందర్భంగా దారి పొడవునా బీరన్నలు చేసే విన్యాసాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆలయానికి వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు. తర్వాత ఆలయంలో బీరన్న, కామరతికి కల్యాణం కూడా చేస్తారు. వీరు కూడా నుదుటిపై బండారి(పసుపు) పెట్టుకొని చేతికి ఉన్న కంకణాన్ని కట్టుకొని తిరిగి ఇళ్లకు బయల్దేరుతారు.
రంగశాయిపేటకు చెందిన కురుమ కులస్తులు ఉదయం ఆలయాన్ని శుభ్రంగా తయారు చేస్తారు. మధ్యాహ్నం మహిళలు బోనాలను నెత్తిన పెట్టుకుని పురవీధుల గుండా డోలు వాయిద్యాల మధ్య కుటుంబ సమేతంగా ఆలయానికి బయల్దేరుతారు. అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆలయ పరిసర ప్రాంతంలో దేవుడి విగ్రహానికి పరదా అడ్డుపెట్టి గొర్రెను బలిస్తారు. తర్వాత బోనాలతో మహిళలు ఇళ్లకు బయల్దేరుతారు.
వందల ఏళ్ల నుంచి నిర్వహిస్తున్నాం..
అందరి సహకరంతో ఏటా బీరన్నస్వామి బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నాం. కురుమల ఆరాధ్య దైవమైన బీరన్నకు కురుమలు వందల ఏళ్ల నాటి నుంచి బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది. డప్పు వాయిద్యాలు, బీరన్నల విన్యాసాలతో బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం.
– ఉర్సు ఆలయ కమిటీ చైర్మన్ మరుపల్ల రవి
భారీ బందోబస్తు చేపడుతాం
ఉన్నతాధికారుల సహకారంతో ఈ నెల 10న తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని చేపట్టే బోనాలకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీ చర్యలు చేపడుతాం. గతంలో జరిగిన విధానాన్ని తెలుసుకుని బందోబస్తు ఏర్పాటు చేస్తాం. గావు పట్టే సన్నివేశం చేసేందుకు భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తాం.
– సీఐ శ్రీనివాస్, మిల్స్‌కాలనీ