ఖిలావరంగల్, జూలై 8: కాకతీయ వైభవ సప్తాహ సంబురాలు రెండో రోజు శుక్రవారం కోటలోని ఖుష్మహల్ ప్రాంగణంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కళాకారుల ఆటాపాటలతో ఓరుగల్లు కోట మార్మోగింది. అదనపు కలెక్టర్ శ్రీవత్స కోట, డీపీఆర్వో బండి పల్లవి, సీపీవో జీవరత్నం జ్యోతి ప్రజ్వలన చేసి వైభవ సప్తాహ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రీయ, నృత్య కళారూపాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ద్విగినికృత ఉత్సాహంతో కళాకారులు నృత్యాలు చేసి ఆహూతులను అలరించారు. అత్యంత రసరమ్య మధురంగా సాగిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు చూపరులను కట్టిపడేశాయి.
ముఖ్యంగా కూచిపూడి నృత్య కళాభిమానులకు కావాల్సిన ఆనందాన్ని పంచారు. సుదీర్రావు బృందంచే కాకతీయ వైభవ కూచిపూడి నృత్య రూపకంలో కాకతీయుల ఏలుపబడిలో కోటలు, ఆలయాల నిర్మాణాలతోపాటు గణపతిదేవుడు, రాణి రుద్రమాదేవి, ప్రతాపరుద్రుడి జనరంజక పాలనను కళ్లకు కట్టినట్లు చూపించారు. రామప్ప ఆలయ విశిష్టతను తెలియచేస్తూ చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. అలాగే, గాదె అశోక్ బృందం డప్పు కళాకారులు అతిథులకు స్వాగతం పలికారు. డాక్టర్ వెంపటి శ్రావణి నృత్యాలు ఎంతగానో అలరించారు.
వేడుకులను విజయవంతం చేయాలి
కాకతీయ వైభవ సప్తాహ వేడుకలు ఈ నెల 13వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు కొనసాగుతాయని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దేశం గర్వించదగ్గ ఎంతో చరిత్ర గల కాకతీయ రాజుల ఘనకీర్తి ప్రపంచ జనవాహినికి తెలియచేసేందుకు ప్రభుత్వం కాకతీయ వైభవ సప్తాహ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అదనపు కలెక్టర్ శ్రీవత్స మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ రాజుల చరిత్రను కొనియాడుతూ యావత్ ప్రజానీకానికి కాకతీయ వైభవ సప్తాహం ద్వారా తెలియజేస్తుందన్నారు. మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్యాదవ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే నరేందర్, జిల్లా అధికార యంత్రాంగం కాకతీయ వైభవ సప్తాహం వైభవంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం అతిథులు కళాకారులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.