నర్సంపేట/నెక్కొండ/నల్లబెల్లి/సంగెం/రాయపర్తి, జూలై 8: జిల్లాలో శుక్రవారం వర్షం జోరుగా కురిసింది. తెల్లవారుజాము నుంచి మొదలైన వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. వర్షపు జల్లులు పొద్దంతా కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. వాగులు, వంకల్లోకి వరదనీరు చేరి ప్రవహిస్తున్నాయి. వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడింది. ఈ సీజన్లో ఇదే పెద్ద వాన కావడంతో చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతున్నది. దీంతో జలాశయాల్లో నీటి మట్టం పెరుగుతున్నది. నెక్కొండ మండలంలో ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. నల్లబెల్లి మండలంలో శుక్రవారం ఉదయం నుంచి వర్షం కురుస్తూనే ఉండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
కొందరు రైతులు వరి నార్లు పోశారు. భారీ వర్షంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరిసింది. సంగెం మండలంలో నిరంతరాయంగా కురుస్తున్న ముసురుతో వ్యవసాయ పనులకు బ్రేక్ పడింది. చెరువుల్లోకి వరద నీరు చేరుతున్నది. మండెలు కట్టి నార్లు పోసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. పత్తి పంటల్లో గడ్డి పెరుగడంతో రైతులు గడ్డి మందు కొడుతున్నారు. రాయపర్తి మండలంలోని 39 గ్రామాల్లో రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళను సంతరించుకుటున్నాయి. జోరు వానలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎస్సై బండారి రాజు సూచించారు.
19 అడుగులకు పాకాల నీటిమట్టం
ఖానాపురం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని పాకాల సరస్సు నీటిమట్టం శుక్రవారం 19 అడుగులకు చేరుకుంది. 18 అడుగులున్న పాకాల నీటిమట్టం ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఒక అడుగు పెరిగింది. సరస్సులోకి నీటిమట్టం చేరుతుండడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాకాల ఆయకట్టులో రైతులు నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు.