ములుగు, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ చరిత్రలో కాకతీయుల పాలనకు ఒక సుస్థిర స్థానం ఉంది. భారతదేశ చరిత్రలోనే ఏ రాజులకూ లేని ప్రత్యేకత ఒక కాకతీయులకే ఉంది. మన తెలంగాణ ప్రాంతాన్ని క్రీపూ 750 నుంచి 1323 వరకు జనరంజకంగా పరిపాలించిన రాజవంశం కాకతీయులు. క్రీస్తుశకం 9శతాబ్దంలో రాష్ట్రకూటుల సేనలుగా రాజకీయ జీవితం ప్రారంభించి ఆంధ్రదేశాన్నంతటినీ ఏకతాటిపైకి తెచ్చి పరిపాలించిన సమర్థులు. వీరికి ఆంధ్ర దేశాదీశ్వర అనే బిరుదు ఉంది. చరిత్రకారులు, అలాగే శాసనాల ఆధారంగా పరిశీలిస్తే కాకతీయుల కులదేవత కాకతి. జైనమత దేవతలైన గుమ్మడమ్మ(కుషాయిని). ఆమెకే మరో పేరు కాకతి. కాకతి ఆరాధకులు కాబట్టే వారు కాకతీయులు అయ్యారని చరిత్రకారుల అభిప్రాయం.
కాకతీయుల విశిష్టతను ప్రపంచానికి చాటి చెబుతూ భావితరాలకు స్ఫూర్తినింపేలా ప్రభుత్వం ఏటా కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు సార్లు కాకతీయ ఉత్సవాలు నిర్వహించారు. చివరిసారిగా 2013లో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాకతీయ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఏర్పాటు జరుగుతున్నాయి. జూలై 7నుంచి ఏడు రోజుల పాటు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లుచేస్తున్నారు. కాకతీయ పరిపాలనను గుర్తుచేస్తూ కాకతీయుల వారసులు ఈ ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేకంగా ఆకర్షణగా నిలువనున్నారు.
ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించి జనరంజక పాలన అందించిన కాకతీయులు ఢిల్లీ సుల్తాన్ దండయాత్ర అనంతరం ఎకడికి వెళ్లారు? ఏమయ్యారు? అనే ప్రశ్నలు అందరి మదిలో ఉన్నాయి. దీనికి సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ నేతృత్వంలో ఉత్సవ కమిటీ రూపొందించి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ వరకు వెళ్లి 22వ తరం వారసులు కమల్చంద్ భంజ్దేవ్ను స్వయంగా కలిసి కాకతీయ సప్తాహం పేరుతో జరుగుతున్న కాకతీయ ఉత్సవాలకు ఆహ్వానించారు. సప్తాహం అని పేరు పెట్టడంలో కూడా ఒక ప్రత్యేకత సంతరించుకుంది. కాకతీయులకు ఏడు సంఖ్య అంటే ఒక సెంటిమెంట్. అందుకే ఏడవ నెలలో ఏడవ తారీఖున ఏడు రోజుల పాటు కాకతీయ చరిత్రను కొనియాడుతూ జరుపుకొనే ఉత్సవమే కాకతీయ సప్తాహం.
కాకతీయ కళావైభవం గురించి తరగతి గదుల్లో పాఠ్య పుస్తకాల్లో కథలు కథలుగా చదువుకున్నాం. అలనాటి స్వర్ణయుగ వైభవానికి, శిల్పకళా సౌందర్యానికి, సాహితీవేత్తల సౌరభాలు వెదజల్లిన నేల, కోహినూరు వజ్రం పుట్టినిల్లు, ఎన్నో అబ్బురపరిచే కట్టడాలకు నెలవు. శాతవాహనుల తర్వాత సుభిక్షమైన పరిపాలన అందించి దేశ సమగ్రతను సమైక్యతను చాటిన పరిపాలనా దక్షులు కాకతీయులు.
పటిష్టమైన గుడాచార వ్యవస్థను కలిగి ఉండి రాజధాని వరంగల్ కోట చుట్టూ మట్టి కోట. కంచుకోట పుట్టకోట, కంపకోట గవని కోట, రాతికోట, కత్తి కోట. ఇలా ఏడంచెలకోటతో శత్రుదుర్భేద్యంగా 12కిలోమీటర్ల నిడివితో ఖిలా వరంగల్ చుట్టూ అతిపెద్ద రక్షణ వలయాన్ని నిర్మించి సుభిక్షమైన పరిపాలన అందించారు. ఒక వంశ చరిత్రను తెలుసుకోవాలంటే శాసనాలు, సాహిత్య ఆధారాలే ముఖ్యం. దక్షిణ భారతదేశంలోనే అనేక పరిపాలనా సంసరణలు తెచ్చి తర్వాత కాలంలో వచ్చిన గోలొండ చక్రవర్తులకు గానీ, విజయనగర రాజులకు గానీ సాహిత్యం, సంసృతి, వాస్తు, శిల్పం పరిపాలనాపరమైన ప్రతి విషయంలో కూడా తర్వాత కాలంలో వచ్చిన ఎంతోమంది చక్రవర్తులకు వీరు ఆదర్శప్రాయులు. ఆంధ్ర శాతవాహనుల తర్వాత ముకలుముకలుగా విడిపోయిన తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలను ఏకం చేసి పరిపాలించిన మొదటి రాజవంశీయులు కాకతీయులు. కాకతీయుల పరిపాలకుల్లో రుద్రదేవుడు, గణపతిదేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు ముఖ్యులు. మంచి పరిపాలనా దక్షులు.
కాకతీయులు కట్టిన దేవాలయాలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అయినవోలు, గూడూరు, ఇనుగుర్తి, కొండపర్తి, పాలంపేట, గణపురంలో ఉన్నాయి. అలాగే పాత కరీంనగర్ జిల్లాలో మంథని, రాయికల్, గొడిశాల, బెజ్జంకి, నగునూరు, కాళేశ్వరంలో ఉన్నాయి. నల్గొండలో నలపాడు, పానగల్లు, పిల్లలమర్రి, మహబూబ్నగర్ జిల్లాలో జకరం, వడ్డేమాన్, ముత్తారం మొదలైన చోట్ల కనిపిస్తాయి. కాకతీయుల కాలం నాటి తెలంగాణ ప్రజల జీవనాన్ని ముఖ్యంగా ఆర్థిక సాంసృతిక పరిస్థితులకు గ్రామదేవతల పూజలు.. వీరుల పూజలు.. క్రీడాభిరామం అనే వీధి నాటకం దర్పణం పడుతుంది.
దేశానికి వెన్నుముక రైతు. వ్యవసాయమే ఆధారంగా కలిగిన రాజ్య ప్రజల కోసం కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్వించడం, వర్షపు నీటిని ఒడిసిపట్టి వృథా కాకుండా ఒక చెరువు నిండిన వెంటనే మిగులు నీరు ఇంకొక చెరువుకు వెళ్లేలా గొలుసుకట్టు చెరువులు తవ్వించారు. రేచర్ల రుద్రుడు పాలంపేటలో రామప్ప చెరువు, మైలాంబ బయ్యారం ధర్మసాగర్ చెరువులు, గణపతిదేవుని సామంతుడు జగదలు ముమ్మడి పాకాల చెరువు నిర్మించారు. ప్రయోజనం పొందిన రైతులు చెరువుల మరమ్మతుకు తన పంట పొలంలో 10వ వంతు శిస్తుగా చెల్లించేవారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కాల్వలను మరమ్మతులు చేయించారు. పెద్ద పెద్ద డ్యాములు నిర్మించి వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారు. రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన వెన్నీస్ యాత్రికుడు మారో పోలో, అమీర్ కుస్రో, వాసఫ్ లాంటి విదేశీ యాత్రికులు కాకతీయుల పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉందని, శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉన్నాయని.. పరిశ్రమలు వాణిజ్యంతో వర్ధిల్లుతున్నాయని అభివర్ణించారు.
కాకతీయుల మూలపురుషుడు వెన్న మొదలు గణపతి దేవుని వరకు 11 తరాల చరిత్ర కలిగిందని శాసనాల ద్వారా తెలుస్తోంది. కాకతీయులు అనగానే రాణీరుద్రమదేవి పౌరుషం వీరత్వం కండ్లముందు సాక్షాతరిస్తుంది. గణపతి దేవుడికి కుమారుడు లేకపోవడంతో రెండో కుమార్తె రాణీరుద్రమకు పురుషోచిత విద్యలు నేర్పి రుద్రదేవ మహారాజుగా సింహాసనం ఎకించాడు. ఆంధ్ర దేశం అంతటినీ ఒక స్త్రీ అసమాన ధైర్యసాహసాలతో అత్యంత సమర్థవంతంగా పరిపాలించిన ఈ ఘట్టం తెలుగువారి చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైనది. స్త్రీ పరిపాలన సహించలేని సామంతులు, దాయాదుల నుంచి ప్రతిఘటనలు ఎదురై పరిపాలనా కాలమంతా యుద్ధమయమైన పరిస్థితుల్లో గోన గన్నారెడ్డి, రేచర్ల రుద్రుడు, త్రిపురాంతకుడు, బెండపూడి అన్నమయ్య మొదలైన వారు ప్రతి పోరాటంలో ఆమెకు బాసటగా నిలిచారు. తెలంగాణ చరిత్రలోనే గణపతి దేవుడు ధైర్యం చేసి స్త్రీ పరిపాలనకు శ్రీకారం చుట్టింది కాకతీయులే. కాకతీయుల కాలంలో సాంప్రదాయ సిద్ధమైన రాచరిక వ్యవస్థ ఉండేది.
రుద్రదేవుడు స్వయంగా కవి, భాషాభిమాని. తను రాసిన నీతి సారం అనే గ్రంథం కాకతీయుల రాజనీతిని తెలియజేస్తుంది. మనమసిద్ధి ఆస్థాన కవి తికన సోమయాజి ఓరుగల్లుకు వెళ్లి గణపతి దేవుని ఆస్థానంలో మహాభారత రచనను పూర్తి చేశాడు. పాలురికి సోమనాథుని పండితారాధ్య చరిత్ర, విద్యనాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం, జాయపసేనాని రాసిన నృత్త రత్నావళి, వినుకొండ వల్లభ రాయుని క్రీడాభిరామం.. ఇది తెలంగాణ ప్రజల జీవితాన్ని ఆర్థిక సాంసృతిక పరిస్థితులకు అద్దం పడుతుంది. ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర, బద్దెన రాసిన నీతి శాస్త్ర ముక్తావళి, కాసే సర్వప్ప రాసిన సిద్దేశ్వర చరిత్ర, గోన బుద్ధారెడ్డి అతని కుమారులు రాసిన రంగనాథ రామాయణం.. కవులు, పండితులు రాసిన తెలుగు, సంసృత గ్రంథాలు కాకతీయుల చరిత్రను తెలుసుకునేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. అలనాటి సాహితీవేత్తల సౌరభాలు కాకతీయుల స్వర్ణయుగ వైభవానికి ప్రతీకలు.
శాసనాలు కాకతీయ చరిత్రకు నిలువుటద్దాలు. తూర్పు చాళుక్యరాజు దానార్ణవుడు వేయించిన మాగల్లు శాసనం, కాకతీయ రుద్రదేవుని హనుమకొండ వేయి స్తంభాల గుడిశాసనం, గణపతి దేవుని సోదరి మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం, గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు వేయించిన పాలంపేట రామప్ప చెరువు శాసనం, గణపతి దేవుని సేనాని మల్యాల హేమాద్రిరెడ్డి వేయించిన ద్రాక్షారామం శాసనం, గణపతి దేవుడు వేయించిన మోటుపల్లి అభయ శాసనం, పువ్వుల ముమ్మడి అనే ఒక బంటు వేయించిన చందుపట్ల శాసనం ముఖ్యమైనవి.
కాకతీయుల నిర్మించిన దేవాలయాలు, కోటలు వారి కళావైభవానికి నిదర్శనం. ఇసుక పునాదులపై ఆలయాల నిర్మాణం వీరి ప్రత్యేకత. ఈ కట్టడాల్లో సున్నం, సిమెంటు ఉపయోగించరు. హనుమకొండలో సిద్దేశ్వరాలయం, పద్మాక్షి ఆలయం మొదలైన గుడులను మొదటి ప్రోలరాజు కట్టించాడు. ఇవి జైనమత ఆలయాలు. కాకతీయ రుద్రదేవుడు రుద్రేశ్వరాలయం (వేయి స్తంభాల గుడి) 1163లో నిర్మించారు. ఇది త్రికుటాలయం శివుడు, కృష్ణుడు, సూర్యులు ఇందులో కొలువై ఉంటారు. ఇకడి నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. వరంగల్ కోటలోని స్వయంభు దేవాలయాన్ని రెండో ప్రోలరాజు నిర్మించారు. నాలుగు వైపులా రాతితో చెకిన ద్వారా తోరణాలు కలవు. ఆనాటి శిల్పుల పనితనానికి నైపుణ్యానికి ఇవి నిదర్శనం. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు 1213లో పాలంపేటలో రామప్ప దేవాలయం కట్టించాడు. కాకతీయ దేవాలయాలన్నింటిలో ఇది తలమానికమైనది. దీని నిర్మాణం నక్షత్రాకారంలో ఉంటుంది. పైకప్పులో రామాయణం, భాగవతం, శివపురాణ గాథలు, నృత్యరత్నావళిలోని నృత్య భంగిమలు, కులవృత్తులకు సంబంధించిన చిత్రాలు ఉంటాయి. ఇందులో నంది విగ్రహం ఎటువైపు నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ దేవాలయాలన్నీ నీటిలో తేలియాడే ఇటుకలతో నిర్మించారు. ఈ మధ్యకాలంలోనే ప్రపంచవ్యాప్త గుర్తింపు కూడా లభించడం విశేషం.
కాకతీయ యుగంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చతుర్వర్ణ వ్యవస్థ కొనసాగింది. దుర్గాష్టమి, దసరా, దీపావళి, మకర సంక్రాంతి, ఉగాది, మహా శివరాత్రి, ఏరువాక మొదలైన పండుగలు జరుపుకొనేవారు. ఏటా కొత్త వ్యవసాయం ప్రారంభించేందుకు ముందు ఏరువాక జరిపేవారు. ఎల్లమ్మ, ఏకవీర, కాకతి, మల్లారమ్మ, బీరప్ప మొదలైన గ్రామదేవతలను పార్వతి, దుర్గ, శివుడు, విష్ణువు అవతారాలుగా పూజించేవారు.
కాకతీయుల కాలంలో పేరిణి నాట్యం విశేష ప్రచారంలో ఉంది. ఇది పురుషులు ప్రదర్శిస్తారు. వీరి కాలంలో వీరులు యుద్ధభూమికి వెళ్లేటపుడు ప్రేరణగా చేసే నాట్యం పేరిణి. గంభీరమైన మృదంగ వాయిద్యం మోగించి శివుడు తమ శరీరంలోకి ఆవహించాలని విశ్వసించేవారు. కాకతీయుల తర్వాత పేరిణి నృత్యం మరుగునపడింది. మళ్లీ ఈ మధ్య కాలంలోనే కొంత పూర్వవైభవాన్ని సంతరించుకుంటోంది. కాకతీయుల కళ, సాహిత్య పోషకులు, వీరి పరిపాలన ఒక స్వర్ణ యుగం.
వ్యాసకర్త
కొమ్మాల సంధ్య, తెలుగు అధ్యాపకురాలు
తాడ్వాయి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ములుగు జిల్లా
9154068272.