దేవరుప్పుల, జూలై 3 : పేదలను చైతన్యపర్చడంతోపాటు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయు ధ పోరాటంలో దొడ్డి కొమురయ్య చూపిన సాహ సం నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచింది. భుమి, భుక్తి కోసం నాడు పోరాడిన దొడ్డి కొమురయ్య అమరత్వం పొంది 76 ఏళ్లయింది. నాడు విస్నూరు రామచంద్రారెడ్డి పెత్తందారీతనానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో వేలాది మంది దండుకట్టిన రోజులవి. కొందరి చేతిలో కేంద్రీకృతమైన వేలాది ఎకరాల భూమిని వారి కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి పేదలకు పంచిన చరిత్ర ఈ ఉద్యమానికి ఉంది. వెట్టి చాకిరీ నుంచి సామాన్యులకు విముక్తి కలిగించిన పోరాటమది. ప్రపంచ పోరాటాల చరిత్రతో పోలిస్తే తెలంగాణ రైతాంగ సాయుధ పోరుకు ప్రత్యేక స్థానం ఉంది. భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో దేవరుప్పుల మండలం కడవెండికి చెందిన దొడ్డి కొమురయ్య తుపాకి తూటాలకు ఎదురొడ్డి వీర మరణం పొందారు. కొమురయ్య పోరాట స్ఫూర్తిని ఈ ప్రాంత ప్రజలు నేటికీ గుర్తు చేస్తూనే ఉంటారు.
నేడు సీపీఐ ఆధ్వర్యంలో కడవెండిలో ర్యాలీ
ప్రతి సంవత్సరం కడవెండిలో సీపీఐ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరవీరుడు 76వ వర్ధంతిని సోమవారం కడవెండిలో నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పా ట్లు చేశారు. ఈ సభకు సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తమ్మెర విశ్వేశ్వర్రావు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆది సాయన్న, పాతూరి సుగుణమ్మ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివా స్, రైతు సంఘం జిల్లా నాయకుడు బిళ్ల తిరుపతిరెడ్డి హాజరుకానున్నారు. సీపీఐ మండల కార్యదర్శి జీడి ఎల్లయ్య మాట్లాడుతూ వర్ధంతి సభకు ప్రజలు,నాయకులు, కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలన్నారు.
సీపీఎం ఆధ్వర్యంలో..
సీపీఎం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సింగారపు రమేశ్ తెలిపారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు హాజరువుతారని ఆయన వివరించారు.