ఖానాపురం, జూన్ 27 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తున్నదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాగంపేటలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్ది ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, జడ్పీటీసీ బత్తిని స్వప్న, అధికారులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత సెల్ఫోన్ల మోజులో పడి విలువైన సమయాన్ని వృథా చేసుకుంటున్నదన్నారు. గ్రామీణ ప్రాంత యువత క్రీడలపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, తహసీల్దార్ జూలూరి సుభాషిణి, ఎంపీడీవో సుమనావాణి, సర్పంచ్ భాషబోయిన ఐలయ్య, ఉపసర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల అభివృద్ధి పనులు ప్రారంభం..
నర్సంపేట : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన బస్తీ-మన బడి పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం నర్సంపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టిందని, తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు స్కూళ్లలో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీ కిషన్, వెంకట్ నారాయణ గౌడ్, బండి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.