పోచమ్మమైదాన్, జూన్ 15: వరంగల్ నగరంలోని కొత్తవాడలో కొలువై ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయ నిర్వహణ భారంగా మారింది. ఏల్ల తరబడి ఇక్కడ పూజాధికాలు నిర్వహిస్తున్న అర్చకుడికి వయస్సు మీదపడడం, ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో నిర్వహణ బాధ్యతలు స్థానికులే కమిటీ వేసి చూసుకోవాలని కోరుతున్నాడు. ఆలయానికి ప్రత్యేకంగా కమిటీ గాని, ట్రస్టీ గాని లేకపోవడం, ప్రధాన అర్చకుడు అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆలయంలో స్వామివారికి పూర్తి స్థాయిలో ధూపదీప నైవేద్యాలు అందడం లేదు. చివరికి వివిధ సందర్భాల్లో ఉత్సవాలు సైతం నామమాత్రంగా కొనసాగుతున్నాయి. నర్సంపేట మెయిన్ రోడ్డు, గోపాలస్వామి గుడి సమీపంలో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి ఆలయాన్ని 1976లో నిర్మించారు. ఇక్కడ ఆంజనేయస్వామి దక్షిణం వైపు ఉండడంతో ఎంతో ప్రాశస్త్యం వచ్చింది. ఆలయ ప్రధాన అర్చకుడు బ్రాహ్మణపల్లి ఆంజనేయశాస్త్రి ధూపదీప నైవేద్య బాధ్యతలు చూసుకుంటూ వస్తున్నారు.
ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ ఆలయం నేడు పట్టింపు కరువై ఆదరణ తగ్గుతున్నది. స్థానికులు, ప్రజాప్రతినిధుల సహాయ, సహకారాలు లేకపోవడంతో నిర్వహణ బాధ్యతలు అర్చకుడికి ఇబ్బందికరంగా మారాయి. 2005 నుంచి కమిటీ లేదు. ఆలయ ట్రస్టీ నిధుల నుంచి నెలకు రూ.16వేలు అందుతున్నా నిత్యం పూలు, కరంటు బిల్లు, ఇతర పూజా సామగ్రికి సరిపోతున్నాయి. ప్రస్తుతం ఆలయంలో ఒక్కరే పూజారి ఉండడం, ఆయనకు వృద్ధాప్యం కారణంగా అనారోగ్య సమస్యలు రావడంతో కొందరు భక్తులు పదేళ్లుగా స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు విజయారాణి, ఎంజీఎం సిస్టర్ జయలక్ష్మి, గృహిణి స్వర్ణశ్రీ నిత్యం ఆలయానికి వచ్చి పనులు చేసి వెళ్తున్నారు. వృద్ధాప్యం కారణంగా ఆలయంలో సేవలు అందించలేకపోతున్నానని, దాతలు, స్థానికులు ముందుకు రావాలని, కమిటీ వేసుకొని ఆలయ నిర్వహణ చూసుకోవాలని ప్రధాన అర్చకుడు ఆంజనేయశాస్త్రి విజ్ఞప్తి చేస్తున్నారు.