ఐనవోలు, జూన్ 14 : దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శంగా నిలుస్తున్నాయని స్టేషన్ ఘన్పూర్ శాసన సభ్యుడు డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం గర్మిళ్లపల్లి గ్రామంలో రూ.10లక్షల వ్యయంతో నిర్మించిన వైకుంఠధామాన్ని ప్రారంభించి, నర్సరీని సందర్శించారు. 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే 12,769 గ్రామ పంచాయతీల్లో ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
సీఎం కేసీఆర్ ప్రతి నెలా జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి రూ.1632 చొప్పున గ్రామ పంచాయతీల ఖాతాలకు నిధులు జమ చేస్తున్నారని చెప్పారు. కేంద్రం మాత్రం 15వ ఆర్థిక సంఘం నిధులను ఇవ్వడం లేదన్నారు. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన 20 జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీల్లో 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఉన్నాయని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామలు అవార్డులు సాధించాయని చెప్పారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఉండాలని సీఎం గొప్ప ఆలోచన చేశారని వివరించారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు జోడెడ్ల వలె పని చేసినట్లయితే గ్రామాలకు అవార్డులు వస్తాయని వివరించారు.
పల్లెప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులను త్రిమూర్తులుగా ఆయన అభివర్ణించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గొకే రేణుక, గండి మల్లికాంబ, ఎంపీటీసీలు పిండి మాధవి, భీరం మౌనిక, ఆలయ పునరుద్ధరణ కమిటీ సభ్యుడు వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో వెంకటరమణ, ఎంపీవో రఘుపతిరెడ్డి, నాయకులు గండి రమేశ్, మోరె శ్రీనివాస్, ఊట్ల ప్రతాప్‌రెడ్డి, లడే రామారావు, బాబురావు, గుడ్డెటి బాబు, లవన్‌కుమార్, షడ్రక్, ఎండీ రంజాన్, గుడ్డెలి ఎలియా, గుండెబోయిన మల్లేశం పాల్గొన్నారు.