నయీంనగర్, జూన్14: మీ భవిష్యత్ మీ చేతుల్లోనే ఉందని, దానిని ఎలా నిర్దేశించుకోవాలన్నది మీపైనే ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ పార్థసారథి అన్నారు. ఏకాగ్రత, పకా ప్రణాళికతో చదివితే కోరుకున్న ప్రభుత్వ కొలువులను దకించుకోవడం కష్టమేమీకాదని పేర్కొన్నారు. హనుమకొండలోని అంబేదర్ భవన్లో గ్రూప్-1కు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీహన్మంతు, గోపితో కలిసి మంగళవారం పార్థసారథి అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరాశ నిస్పృహను దరిచేరనివ్వకుండా ఎలాగైనా సాధిస్తాననే సంకల్పంతో కష్టపడితే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేయడంతో అపోహలకు ఆసారం లేకుండా పోయిందని తెలిపారు. పోటీ పరీక్షలకు సంబంధించి పరీక్ష విధానం, సిలబస్‌లో పెద్దగా తేడా ఉండదని విషయం, పరిజ్ఞానం, అవగాహన ముఖ్యమని అన్నారు. ఎన్ని గంటల పాటు చదివాం అని కాకుండా, ఎంత ఏకాగ్రతతో చదివాం, చదివిన అంశాలను పరీక్షలో ఎలా రాశాం అన్నదే అభ్యర్థుల విజయావకాశాలను నిర్ణయిస్తుందని అన్నారు.
నేర్చుకుంటున్న అంశాలను ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేసుకుంటూ, ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించారు. పోటీ పరీక్షల సన్నద్ధత వన్ డే మ్యాచ్ కాదని, దీనిని టెస్ట్ మ్యాచ్‌గా భావిస్తూ, నిలకడ, ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం స్థానికులకు 95 శాతం ప్రాధాన్యం ఇస్తూ, ఉద్యోగాల వయస్సు 21 నుంచి 49 సంవత్సరాల వరకు పెంచడం గొప్ప నిర్ణయమన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, డీఆర్డీవో శ్రీనివాస్‌కుమార్, డీపీవో వీ జగదీశ్వర్, మైనార్టీ సంక్షేమ అధికారి మేన శ్రీను, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి నిర్మల, హనుమకొండ ఏసీపీ కిరణ్‌కుమార్, సుబేదారి సీఐ రాఘవేందర్, గ్రూప్-1 అభ్యర్థులు పాల్గొన్నారు.