వర్ధన్నపేట, జూన్ 11: వర్ధన్నపేట మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నది. పట్టణ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 20 కోట్లు, మంత్రి దయార్‌రావు మరో రూ. 10 కోట్లను మంజూరు చేయడంతో వర్ధన్నపేటలో రూ. 30 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీంతో పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. జాతీయ రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టి ఆకేరు, సంగెం వాగులకు రెండు వైపులా మురుగునీరు వెళ్లేలా నిర్మిస్తున్నారు. అలాగే, ఆకేరువాగు సమీపం నుంచి సంగెం వరకు ఆధునిక డివైడర్ నిర్మాణ పనులు పూర్తికావొచ్చాయి. ఈ పనులు పూర్తయితే పట్టణం పరిశుభ్రంగా తయారు కావడంతోపాటు విశాలమైన రహదారులు అందుబాటులోకి రానున్నాయి. సుమారు 0.8 టీఎంసీ సామర్థ్యం కలిగిన కోనారెడ్డి చెరువు కట్టను పటిష్టం చేసేందుకు ఇటీవల రూ. 14 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇటీవల మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే, పట్టణంలో చిరువ్యాపారులకు చేయూతనందించేందుకు వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్లోని ఆర్అండ్బీ అతిథి గృహం స్థలంలో రూ. రెండు కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
నిర్మాణంలో మున్సిపల్ కార్యాలయ భవనం
రూ. 1.50 కోట్లతో చేపట్టిన వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులు 50 శాతం మేర పూర్తయ్యాయి. వచ్చే ఏడాదిలోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అలాగే, పట్టణ పరిశుభ్రత కోసం అంబేద్కర్ సెంటర్, కొత్త బస్టాండ్ వద్ద ఆధునిక పబ్లిక్ టాయిలెట్లు నిర్మించారు. దీంతో వ్యక్తిగత పనుల కోసం పట్టణానికి వచ్చిన ప్రజలు టాయిలెట్లను ఉపయోగిస్తుండడంతో పరిశుభ్ర వాతావరణం కనిపిస్తున్నది. నిత్యం పట్టణాన్ని శుభంగా ఉంచేందుకు మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రహదారులను శుభ్రం చేస్తూ చెత్తను డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. దీంతో వర్ధన్నపేట కొత్తశోభను సంతరించుకుంది.
రూ. 12 కోట్ల పనులు పూర్తి
వర్ధన్నపేట పట్టణం అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 30 కోట్లలో ఇప్పటి వరకు రూ. 12 కోట్ల మేర అభివృద్ధి పనులు పూర్తి చేశాం. మరో రూ. 18 కోట్ల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులను 2023 మార్చిలోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రత్యక్షంగా పాల్గొంటూ ప్రతి పనిని పరిశీలిస్తున్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి వర్ధన్నపేట పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చేందుకు శ్రమిస్తున్నాం.
– గొడిశాల రవీందర్, మున్సిపల్ కమిషనర్