నర్సంపేట, జూన్ 6: రైతు కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35 మంది బాధిత కుటుంబాలకు రూ. 1.75 కోట్ల విలువైన రైతుబీమా చెక్కులను పెద్ది పంపిణీ చేసి మాట్లాడారు. రైతుబీమా పథకం యావత్ తెలంగాణ రైతులకు భరోసా కల్పిస్తున్నదని తెలిపారు. అన్నంపెట్టే రైతులు అకాల మరణం పొందితే వారిపై అధారపడి జీవిస్తున్న కుటుంబం రోడ్డున పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతుబీమా పథకం ద్వారా రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. రైతుబంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి అభినందించేలా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారని కొనియాడారు.
గుంట వ్యవసాయ భూమికి కూడా ఈ పథకం వర్తిస్తున్నదని వివరించారు. రైతుబీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తున్నదని గుర్తుచేశారు. ఇంత గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకం పేదరికాన్ని నిర్మూలించేలా ఉందన్నారు. ఇప్పటివరకు నియోజకవర్గంలో రైతుబీమా పథకం కింద రూ. 37.50 కోట్లను 750 మంది రైతు కుటుంబాలకు అందించినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీలు, జడ్పీటీసీ, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు, ఆర్బీఎస్ డైరెక్టర్లు, సభ్యులు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.