వరంగల్, మే 31 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ బడి బాట కార్యక్రమం నిర్వహణకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. శుక్రవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నందున సంసిద్ధత సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడి బాట కార్యక్రమం నిర్వహణతో పాటు పాఠశాలల పునఃప్రారంభంపైనా ఎంఈవోలు, పాఠశాలల ప్రదానోపాధ్యాయులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈనెల 3 నుంచి 10 వరకు బడి బాట కార్యక్రమం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సోమవా రం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అన్ని జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బడిబాట కార్యక్ర మం నిర్వహణ, జూన్ 13న పాఠశాలల పునఃప్రారంభంపై ప్రభుత్వ నిర్ణయాలు తెలిపారు. జిల్లా నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి డీ వాసంతి, సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు మాలోత్ సారయ్య, కుడికాల సుభాష్, పీ రమాదేవి, ఓడపల్లి సుధీర్‌బాబు, ఎంఈవోలు విజయ్‌కుమార్, సత్యనారాయణ, రంగయ్య, వీ రత్నమాల, ఏఎస్వో కే బాబు తదితరులు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నా రు. ఈసారి ప్రభుత్వం నిర్వహించే బడి బాట కార్యక్రమం ప్రత్యేకత సంతరించుకుంది. ఎందుకంటే జూన్ 13 నుంచి ప్రారంభమయ్యే విద్యాసంవత్సరంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం బోధన అమల్లోకి రానుంది.
ఇంగ్లిష్ మీడియం బోధన కోసం ఇప్పటికే కొద్ది నెలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విద్యాశాఖ అధికారులు విడుతల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లిష్ మీడియం బోధన అమల్లోకి రానున్నందున సర్కారు బడులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా మూడు విడుతల్లో మౌలిక వసతులు కల్పించి అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నిధులు కేటాయించింది. తొలివిడుత ఈ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసేందుకు ఎక్కువ మంది విద్యార్థులు గల పాఠశాలలను ఎంపిక చేసింది. ఈ పాఠశాలల్లో అవసరాలను గుర్తించిన అధికారులు ఇప్పటికే అభివృద్ధి పనులు చేపట్టారు.
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 13 లోగా సాధ్యమైనంత వరకు పనులను పూర్తి చేసి సకల వసతులకు కేరాఫ్‌గా సర్కారు స్కూళ్లను అభివృద్ధి చేసే పనుల్లో తలమునకలయ్యారు. మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం అమల్లోకి రావడం, మరి కొద్ది రోజుల్లో అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ 3 నుంచి జరిగే బడి బాట కార్యక్రమంలో వీటిపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వం అధికార యం త్రాంగాన్ని ఆదేశించింది. ప్రధానంగా సర్కారు స్కూళ్ల ను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేయ డం ద్వారా వాటిలో ఇంగ్లిష్ మీడియం బోధనతో ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలను సర్కారు స్కూళ్ల బాట పట్టించడం, పిల్లల తల్లిదండ్రులపై ప్రైవేట్ ఫీజుల ఆర్థిక భారం తగ్గించాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
ఏడు రోజులు బడి బాట
ఏడు రోజుల పాటు బడి బాట కార్యక్రమం జరగనుంది. ఈనెల 3న ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థుల సహకారంతో ప్రతి హ్యాబిటేషన్ పరిధిలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తొలిరోజు 3న బడి బాట కార్యక్రమం బ్యానర్‌తో ఆయా గ్రామాల్లో ర్యాలీలు జరుపుతారు. మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంపై ప్రజలకు తెలియజేస్తారు. 4న ఆంగ్ల భాషను పరిపుష్టం చేసే కోర్సు ఈఎల్ఈసీపై, 6న బాలికా విద్య, 7న సామూహిక అక్షరాభ్యాసం, 8న స్వచ్ఛ పాఠశాల, హరితహారంపై వివరిస్తారు. 9న పాఠశాల విద్యా కమిటీలు, పేరెంట్స్, టీచర్ల సమావేశాలు నిర్వహిస్తారు.
చివరి రోజు 10న బడి బయట పిల్లలు, దివ్యాంగుల పిల్లల నమోదు కార్యక్రమం జరుపుతారు. ఏడు రోజులు కూడా ఇంటింటికి వెళ్లి, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించి బడి మానేసిన పిల్లల పేర్లను నమోదు చేయడంతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపిస్తున్న తల్లిదండ్రులను కలిసి ఈ ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లకు పం పాలని ఆహ్వానిస్తారు. ప్రైవేట్ స్కూళ్లలో కంటే సర్కారు స్కూళ్లలో నాణ్యమైన విద్య లభించనుందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన స్పెషల్‌ను తెలియజేసి మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం దళవారీగా స్కూళ్లను అభివృద్ధి చేస్తుండడాన్ని వివరిస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 13న ప్రజాప్రతినిధులు, ఎస్ఎంసీలను, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించేందుకు, వారికి ప్రభుత్వం అందించే సౌకర్యాలు, మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం, ప్రభుత్వ స్కూళ్లలో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన ప్రారంభం వంటివి వివరించేందుకూ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళిక
జూన్ 3 నుంచి 10 వరకు జిల్లాలో బడి బాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించాం. ఈ కార్యక్రమం అమలుకు సోమవారం జిల్లాలోని ఎంఈవోలు, పీఆర్పీలతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించాం. బడి బాట కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో బ్యానర్లతో ర్యాలీలు జరుపాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమ బోధన అమల్లోకి రానుండడం, పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన మన ఊరు- మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమం, ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేయాలని చెప్పాం. మంగళవారం కూడా ఎంఈవోలతో ఇదే అంశంపై జూమ్ మీటింగ్ నిర్వహించాం. పాఠశాలల్లో పరిశుభ్రత కార్యక్రమం మొదలైంది. బుధ, గురువారం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సంసిద్ధత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు బడి బాట కార్యక్రమంపై స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులకు సమాచారం ఇస్తారు. జూన్ 13న పాఠశాలల ప్రారంభాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టాం.
– డీ వాసంతి, డీఈవో, వరంగల్