కేంద్రంలోని బీజేపీ సర్కారు కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్ముకుంటూ ఉద్యోగులను, కార్మికులను ఆగమాగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31 వరకు నిర్వహించిన కార్మిక చైతన్య మాసోత్సవాల ముగింపు సందర్భంగా కాజీపేట ఫాతిమానగర్‌లోని సెయింట్ గ్యాబ్రియల్ మైదానంలో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన ‘కార్మిక ధర్మయుద్ధం’ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కవిత మాట్లాడుతూ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్రం నాలుగు నల్లచట్టాలను తెచ్చిందని, వాటిని తొలగించేదాకా రైతుల తరహా కార్మికులు సైతం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
– హనుమకొండ చౌరస్తా/కాజీపేట మే 31
హనుమకొండ చౌరస్తా/కాజీపేట మే 31 : కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వరంగ సంస్థలకు అమ్మేస్తూ కార్పొరేట్లకు తొత్తుగా పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వం అంటే కన్నతల్లిగా కళ్లల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు. కార్మిక చైతన్య మాసోత్సవం ముగింపు సందర్భంగా మంగళవారం కాజీపేట ఫాతిమానగర్‌లోని సెయింట్ గ్యాబ్రియల్ మైదానంలో ఏర్పాటుచేసిన ‘కార్మిక ధర్మయుద్ధం’ బహిరంగ సభకు ఎమ్మెల్సీ కవిత ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు కోసం ఏర్పాటుచేసిన ఈ సభకు ఎమ్మెల్సీ కవితతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్రాజ్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, రాష్ట్ర దివ్యాంగుల సంస్థ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, రాష్ట్ర రైతు రుణవిమోచన సంస్థ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టీఆర్ఎస్.. కార్మిక సర్కారు..
30 రోజుల్లో మండుటెండలో కార్మికుల కోసం తిరుగుతూ వినయ్‌భాస్కర్ ప్రతిఒక్కరితో ముచ్చటించి కార్మికులు, వారి కుటుంబసభ్యుల సమస్యలు, స్థితిగతులు తెలుసుకున్నారని కవిత పేర్కొన్నారు. నష్టాల్లో నడుస్తున్న ఆర్టీసీ ప్రైవేటుపరం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇచ్చి కాపాడుకుందని, ఆటోకార్మికులకు రోడ్డు ట్యాక్స్ రద్దు చేసి ఆదుకుందని, విద్యుత్ శాఖలో 25వేల మంది కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేసిందని గుర్తుచేశారు. 75 ఏళ్లుగా తీరని సింగరేణి కార్మికుల సమస్యలను టీఆర్ఎస్ పార్టీ కేవలం ఎనిమిదేళ్లలో తీర్చిందన్నారు. కార్మికుడి చెమటచుక్కకు విలువనివ్వని ప్రభుత్వాలు ఎక్కువరోజులు మనుగడు సాగించలేదని గత ప్రభుత్వాలను విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరిస్తున్నదని 44 చట్టాలను చాపచుట్టినట్లు చుట్టేసి 4 లేబర్ కోడ్స్‌తో నల్లచట్టాలను తీసుకొచ్చిందని మండిపడ్డారు. వీటి వల్ల కార్మికులు సంఘం పెట్టవద్దని, స్ట్రైక్ చేయవద్దని, ఏమీ అడిగే హక్కు లేకుండా చేసిందని వీటిని తొలగించేదాకా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నల్లచట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు ఉద్యమించినట్లే కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన నాలుగు నల్లచట్టాలను రద్దు చేసేవరకు కలసికట్టుగా ఉద్యమించాలని, సీఎం కేసీఆర్ కూడా అండగా ఉంటారని చెప్పారు.
అసలు దేశంలో ప్రధాని అదానీగా ప్రపంచం చర్చించుకుంటున్నదన్నారు. ప్రధాని ఎన్నికలు లేదా ఎరోప్లేన్ మోడ్‌లో ఉంటారని విమర్శించారు. యూపీ ఎన్నికల్లో ఇంటింటికీ ఉచితంగా రేషన్ ఇస్తామని చెప్పి తర్వాత బైక్, రెండు లైట్లు, ముగ్గురు ఉంటే ఇవ్వమని నిబంధనలు పెడుతున్నదని మండిపడ్డారు. సమైక్యపాలనలో అజాంజిహి మిల్లు పోయిందని దాని స్థానంలో వరంగల్‌లో టెక్స్టైల్ ఏర్పాటుచేయాలన్నది కేసీఆర్ కల అని చెప్పారు. వరంగల్ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని 2వేల ఎకరాలు కేటాయించి టెక్స్టైల్ పార్కు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. సభలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, టీజీవో కో ఆర్డినేటర్ జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్పొరేటర్లు, ఎలకంటి రాములు, సంకు నర్సింగారావు, నల్ల స్వరూపారాణి, టీఆర్కేఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, డాక్టర్ జగదీశ్, ఆంజనేయులు, సందెళ్ల హరినాథ్, సునీల్, సత్తార్, ఫక్రుద్దీన్, పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తాటి సత్యనారాయణ, ట్రైసిటీ ఆటో యూనియన్ అధ్యక్షుడు సిరిల్ లారెన్స్, భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర అధ్యక్షుడు తేలు సారంగపాణి, గ్యాదరబోయిన కొమురయ్య, రాజేశ్‌కన్నా, నాయిని రవీందర్, 50 సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.

కార్మికులకు అండగాఉంటా..
బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ జాగృతి ద్వారా ఎమ్మెల్సీ కవిత యావత్ దేశ, విదేశాలకు తెలంగాణ సంస్కృతిని తెలియజేసింది. కార్మిక చైతన్య మాసోత్సవాల్లో భాగంగా 30 రోజుల నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టి, కార్మికుల సమస్యలు తెలుసుకున్నా. తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారికి ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. సంఘటిత, అసంఘటిత కార్మికులతో 30 ఏళ్లుగా విడదీయని అనుబంధం ఉంది. సమైక్య రాష్ట్రంలో చిరువ్యాపారులు, ఆటోలపై హోంగార్డులు ప్రతాపం చూపించేరు. కానీ సీఎం కేసీఆర్ సర్కారు.. ఆటోకార్మికులు గౌరవంగా బతకడానికి రోడ్డు ట్యాక్స్ రద్దు చేసింది. అంగన్వాడీ, ఆశావర్కర్లకు గౌరవ వేతనం అందిస్తున్నది. సంఘటిత, అసంఘటిత కార్మికులు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో బతికేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. కార్మికుల కుటుంబ సభ్యుల స్ఫూర్తితో 30 రోజుల కార్యక్రమాలను విజయవంతం పూర్తి చేసుకున్నాం.
గులాబీ సైన్యానికి కార్మికులు అండగా ఉంటున్నారు. కారు పార్టీ వారే కార్మికుల సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం ఏర్పడింది. ఝూటా పార్టీ ఝూటా మాటలను ప్రజలు నమ్మద్దు. మోటార్ వెహికల్ యాక్ట్ తెచ్చి ట్యాక్స్ పెంచుతుంది. సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలు తీర్చేందుకు కేసీఆర్ నడుంబిగించారు. వారి బతుకులు మారాలి. ఆటో కార్మికుడి కొడుకు ఆటో నడపవద్దని టెక్నాలజీని వినియోగించుకోవాలి. చిరువ్యాపారి స్వరూప కొడుకు జయంత్‌కు మెడిసిన్ సీటు వస్తే రూ.35 వేలు, రాజు కొడుకుకు ఐఐటీలో సీటు వస్తే రూ.45 వేలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నా. కార్మికుల కుటుంబాల్లో భరోసా నింపేందుకు ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు, కార్మికులకు గులాబీ జెండా అండగా ఉంటుంది. గర్వంగా, గౌరవంగా బతకడానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చింది. ఉద్యోగులు, కార్మికులు కలిసి పోరాడాలి. ప్రాణం ఉన్నంతవరకు కార్మికులకు అండగా ఉంటా. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి అంబాని, అదానీ చేతుల్లోకి పోతే ఉద్యోగాలు వస్తాయా?, సీఎం కేసీఆర్ ఉన్నంతవరకు ప్రభుత్వసంస్థలను అమ్మకుండా కాపాడుతాడు.
– ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్

అన్ని సంఘాలకు ఆమే అధ్యక్షురాలిగా ఉండాలి
సింగరేణి గౌరవాధ్యక్షురాలిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలోని అన్ని కార్మిక సంఘాలకు గౌరవాధ్యక్షురాలిగా కొనసాగాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అభిప్రాయపడ్డారు. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కుతో లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని పేర్కొన్నారు. వరంగల్‌పై వినయ్‌భాస్కర్‌కు ప్రేమ ఎక్కువ అని, కార్మిక నాయకుడిగా ఆయనకు 30 ఏళ్లుగా అనుబంధం ఉందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడిభుజంగా ఉంటున్న వినయ్‌భాస్కర్ కార్మికులు, పేదలపక్షపాతి అని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల కోసం లక్ష మోటార్ సైకిళ్లు ఇస్తుండగా హనుమకొండ జిల్లాలో 10వేల మోటార్ సైకిళ్లు ఇప్పించాలని ఎమ్మెల్సీ కవితను మంత్రి కోరారు.
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
సభలో చేసిన తీర్మానాలు
ఎల్ఐసీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి.
ప్రభుత్వ ఉద్యోగుల ఐటీ స్లాబ్‌ను రూ.2.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచాలి
బీఎస్ఎన్ఎల్, ఇతర ప్రభుత్వ సంస్థలను కేంద్రమే నిర్వహిస్తూ సామాజిక న్యాయం పాటించాలి
గ్రామీణ ఉపాధి హామీ పథకంలా పట్టణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి భద్రత కల్పించాలి.
రద్దు చేసిన కార్మిక హక్కులను పునరుద్ధరించాలి
సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి
విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి
ప్రొఫెషనల్ ట్యాక్స్ నుంచి సెలూన్ వర్కర్స్కు మినహాయింపు ఇవ్వాలి