వరి కొయ్యలు, మక్కజొన్న వ్యర్థాలను కాల్చడం వల్ల భూసారం కోల్పోయి, పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. పర్యావరణానికి నష్టం కలుగుతుందని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. పొలంలోనే వాటిని కలియదున్నడం వల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు వస్తాయని రైతులకు సూచిస్తున్నారు. పొలంలో నాట్లు వేయడానికి ముందు, దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్ ఫాస్పేట్ వేస్తే కొయ్యలు తొందరగా కుళ్లి, సేంద్రియ ఎరువుగా ఉపయోగ పడుతుందంటున్నారు.
– కేసముద్రం, మే 27
కేసముద్రం, మే 27: పొలాల్లో వరి కొయ్యలు, మక్కజొన్న వ్యర్థాలను కాల్చివేయడం వల్ల భూసారం కోల్పోయి, పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉన్నదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. కాల్చేయొద్దు.. కలియదున్నుదామని రైతులకు సూచిస్తున్నారు. కలియదున్నడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలని తెలుపుతున్నారు.
వానకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు. ఈ సమయంలో పల్లెల్లో ఎటు చూసినా వరి కొయ్యలు, మొక్కజొన్న, ఇతర పంటల వ్యర్థాలను కాల్చివేయడం, పొలాల్లో చెలరేగుతున్న మంటలు, కారుమబ్బుల్లా వ్యాపిస్తున్న పొగ కనిపిస్తున్నాయి. పంట వ్యర్థాలను కాల్చివేస్తున్న క్రమంలోనూ రైతులు అస్వస్థతకు గురవుతున్న సందర్భాలు లేకపోలేదు. ఇలాంటి సమయంలో ప్రత్యామ్నామ పద్ధతులు పాటించాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
మారుతున్న పద్ధతులు
వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా కూలీలకు బదులుగా సాగులో యంత్రాలను ఉపయోగించాల్సి వస్తున్నది. గతంలో కూలీలు, పశువుల ఆధారంగా వ్యవసాయపనులు చేపట్టేవారు. ప్రస్తుతం యాంత్రీకరణతో గంటల్లోనే ఎకరాల కొద్ది వరి కోతలు జరిగిపోతున్నాయి. సంప్రదాయ పద్ధతిలో కొడవళ్లతో వరి పంటను కోసి గడ్డిని పశువులకు ఉపయోగించేవారు. మిషన్లతో కోయడం వల్ల వరి దుబ్బలు ఎక్కువగా ఉండడం, గడ్డి పొలం మడుల్లోనే ఉండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాలను కలియదున్నాలని, దీంతో ప్రయోజనాలు అనేకం ఉన్నాయని వ్యవసాయ అధికారులు గ్రామా ల్లో రైతులకు వివరిస్తున్నారు.
ప్రత్యామ్నాయాలు
వరి దుబ్బలు, పంట వ్యర్థాలను కాల్చివేయకుండా శక్తి వనరుగా ఉపయోగించుకోవాలి. తద్వారా గ్రీన్ హౌస్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. వరి కొయ్యలు, వ్యర్థాలను నేలలో కలియ దున్ని, కలియబెట్టి నేల సారాన్ని పెంచుకోవచ్చు. తదుపరి సాగు చేసే పంటల వేరు వ్యవస్థ బలోపేతానికి ఇది దోహదం చేస్తుంది. నాట్లు వేయడానికి ముందు, దమ్ము చేసేటప్పుడు ఎకరానికి 50 కిలోల సూపర్ పాస్పేట్ కొయ్యలు తొందరగా కుళ్లి, సేంద్రియ ఎరువుగా మారుతుంది.
భూసారం పెంపొందించుకోవాలి
ఎరువులు, పురుగుల మం దులు ఎక్కువగా ఉపయోగించడానికి బదులుగా పంట వ్యర్థాలను భూమిలో కలియదున్నితే భూమి సారవంతంగా మారుతుంది. వరి కొయ్యలు, పంట వ్యర్థాలను కాల్చివేస్తే నేలకు, పర్యావరణానికి నష్టం కలుగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించాలి. దీంతో నేలకు, పంటకు, పర్యావరణానికి మేలు కలుగుతుంది.
-వెంకన్న, వ్యవసాయ అధికారి, కేసముద్రం