సుబేదారి, మే 26 : బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్ రాష్ట్ర సైబర్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు గురువారం హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మనోజ్జైస్వాల్, జ్ఞానేంద్రయాదవ్, బీహార్ వార్సాలిగంజ్కి చెందిన రాజ్‌కుమార్ ఆన్లైన్ ద్వారా బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని పలువురిని నమ్మించారు. ఇండియా బుల్స్ మేనేజర్ పేరుతో రుణాలు ఇప్పిస్తామని ఐనవోలుకు చెందిన బొంత రవీందర్ వద్ద రూ.1.36 లక్షలు వసూలు చేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వరంగల్ పోలీసు కమిషనరేట్ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు వెళ్లి ముగ్గురిని అదుపులోకి తీసుకుని అజంఘడ్ కోర్టులో హాజరు పరిచింది. తిరిగి వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు తీసుకొచ్చారు. పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ విచారణ అనంతరం ముగ్గురు నిందితుల నుంచి బ్యాంకు యూపీఐ ఖాతాలు, సెల్ఫోన్లు, సిమ్‌కార్డులు, 1.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. కేసులో ప్రతిభ చాటిన ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, ఏసీపీ నరేశ్‌కుమార్, పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్, ఐనవోలు ఎస్సై భరత్, సిబ్బందిని సీపీ అభినందించారు.