నర్సంపేట రూరల్, మే 26 : బాలలకు ఏ అంశాన్నైనా, విషయాన్ని అయినా వారికి ఆసక్తి కలిగించేలా నేర్పించాలని సంఘ మిత్ర యూత్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొంగళ్ల అశోక్ అన్నారు. గురువారం నర్సంపేట పట్టణం ద్వారకపేట ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో సంఘమిత్ర యూత్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిల్డ్రన్స్ సమ్మర్ క్యాంప్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్ మాట్లాడుతూ బాలలకు విద్యా, విజ్ఞానాన్ని బలవంతంగా నేర్పకూడదని, వారిలో ఆసక్తిని కలిగించేలా చర్యలు చూడాలన్నారు. విద్యార్థులు క్రీడలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. ఆన్లైన్ గేమ్స్ వీడి గ్రౌండ్లో ఆటలాడుతూ మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు మ్యూజికల్ చైర్‌తో పాటు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్, పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్లు అలువాల తేజస్విని, వాణి, సంఘమిత్ర యూత్ అధ్యక్షుడు తోట రవి, కార్యదర్శి పెండ్యాల రాకేశ్ తదితరులున్నారు.