కాశీబుగ్గ/వరంగల్ చౌరస్తా, మే 26 : నగరంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో ఆపరేషన్ వికటించి రోగి పరిస్థితి విషమంగా మారిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. చెన్నారావుపేట మండలానికి చెందిన మండల మల్లేశ్ (60)ఈ నెల 15న ఇంటి వద్ద కళ్లు తిరిగి పడిపోగా, నగరంలోని సదరు దవాఖానకు తరలించారు. వైద్యులు తలకు స్కానింగ్ చేయగా రక్తం గడ్డ కట్టినట్లు రిపోర్టు వచ్చింది. ఆరోగ్యశ్రీ కింద పేషెంట్‌ను అడ్మిట్ చేసుకుని తలకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం పేషెంట్‌కు ఆరు రోజులు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తర్వాతత ప్రతి రోజూ అదనంగా చార్జీలు చెల్లించాలని వైద్యులు తెలిపారు. అలాగే, రోగి పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాదుకు తరలించాలని సూచించారు. ఖర్చులు భరించే స్థితిలో లేని కుటుంబసభ్యులు గడువుకాలం ముగియడంతో బాధితుడిని ఎంజీఎం తరలించారు. కాగా, అత్యవసర పరిస్థితుల్లో బాధితుడికి ఆరోగ్యశ్రీ వైద్య సేవలను మధ్యలో నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్‌పై అధికారులు విచారణ చేపట్టారు.
గురువారం రాత్రి ఎంజీఎంలో చికిత్స పొందుతున్న బాధితుడి కుటుంబసభ్యులను వారు విచారించారు. శస్త్రచికిత్స సమయంలో బాధితుడి శరీరం నుంచి తొలగించిన పుర్రె భాగాన్ని తిరిగి యధాస్థానంలో పెట్టకుండానే ఎంజీఎంకు తరలించారని కుటుంబసభ్యులు ఆరోగ్యశ్రీ అధికారులకు వెల్లడించారు. దీంతో బాధితుడి ఆరోగ్యస్థితిని తెలియజేస్తూ వైద్యసేవల కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఎందుకు దరఖాస్తు చేయలేదని, అత్యవసరంగా పేషెంట్‌ను ఎంజీఎం దవాఖానకు తరలించాల్సిన అవసరం ఏముందని సంబంధిత ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులను వివరణ కోరినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు అందించనున్నట్లు జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ అభిలాశ్ తెలిపారు.