హనుమకొండ చౌరస్తా, మే 22: ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం చాలామంది స్విమ్మింగ్‌తో కూల్ అవుతున్నారు. ఈత వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. స్విమ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు శరీర అలసట తగ్గుతుంది. రెగ్యులర్‌గా స్విమ్మింగ్ చేస్తే ఉల్లాసంగా.. ఉత్సాహంగానూ ఉంటారు. అందుకే హనుమకొండలో బాలసముద్రంలోని స్విమ్మింగ్ పూల్‌కు పిల్లలు, పెద్దలు క్యూకడుతున్నారు. నిత్యం 600మందితో సందడిగా కనిపించే పూల్‌కు రోజురోజుకూ తాకిడి పెరుగుతోంది. కరోనా కారణంగా రెండేళ్ల విరామం తర్వాత స్విమ్మింగ్ పూల్ మళ్లీ కళకళలాడుతోంది.
హాట్ సమ్మర్లో నగర ప్రజలు కూల్‌గా స్విమ్మింగ్ చేస్తున్నారు. హనుమకొండ జిల్లా యువజన క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో బాలసముద్రంలోని ఈ పూల్ ఏర్పాటుచేశారు. ఉదయం, సాయంత్రం స్విమ్మింగ్ కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఉదయం 6నుంచి 8గంటల వరకు మళ్లీ సాయంత్రం 4-6 గంటల వరకు మూడు బ్యాచ్‌లు నడుస్తున్నాయి. రోజుకు 600 మంది వరకు స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వస్తున్నారు. 2005లో ప్రారంభించిన స్విమ్మింగ్ పూల్ గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి తాకిడి పెరిగింది. ఇంకా పెరిగే అవకాశం లేకపోలేదు. స్విమ్మింగ్ నేర్చుకునేందుకు వచ్చిన వారిని పర్యవేక్షించేందుకు లైఫ్‌గార్డ్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా స్విమ్మింగ్ కోచ్‌ను కూడా నియమించారు. జిల్లాకేంద్రంలోని ఈత కొలనును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీవైఎస్వో గుగులోత్ అశోక్‌కుమార్ నాయక్ కోరారు.
ప్రయోజనాలివీ..
స్విమ్మింగ్ చేయడం వల్ల శరీరంలోని కేలరీలు వేగంగా కరిగిపోతాయి. పరిగెత్తడం వల్ల ఎంత ఎక్కువ బరువు తగ్గితే, ఈత కొట్టడం ద్వారా బరువు తగ్గుతారంటారు. ఈత ద్వారా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నట్లయితే దానితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా తీసుకోవాలి. ఈత కొట్టేందుకు శరీరానికి శక్తి పుష్కలంగా అవసరం. అలాగే పోషకాహారం తీసుకోవాలి. అతిగా తినకూడదు.. లేదంటే శ్రమకు ప్రయోజనం ఉండదు. స్విమ్మింగ్ ద్వారా బరువు కోల్పోతుంటే.. ప్రోటీన్ షేక్ తాగాలి. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
స్విమ్మింగ్‌పూల్‌లోకి దిగే ముందు స్విమ్మింగ్ డ్రెస్ తప్పనిసరిగా ధరించాలి. అద్దాలు, ప్యాంట్లు, చొక్కాలతో పూల్‌లోకి దిగకూడదు.. స్విమ్మింగ్‌పూల్‌లో ఒకవైపు లోతు తక్కువగా, మరోవైపు లోతు ఎక్కువగా ఉంటుందని తెలుసుకోవాలి. చిన్న పిల్లలకు కూడా ప్రత్యేకంగా స్విమ్మింగ్ ఏర్పాటుచేశారు. గర్ల్స్, బాయ్స్ సపరేటుగా సమయాన్ని కేటాయించారు. మద్యం సేవించి వస్తే పూల్‌లోకి అనుమతించరు.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు
ప్రతిరోజూ ఒకేలా ఈత కొట్టకుండా ప్రయత్నించాలి. ఈతలో వివిధ స్ట్రోక్‌లను ప్రయత్నించాలి. స్విమ్మింగ్ నిపుణుడిని లేదా శిక్షకుడిని సంప్రదించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ స్ట్రోక్‌లు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అలాగే శరీరంలోని అదనపు కేలరీలు, కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. బటర్‌ఫ్లై స్ట్రోక్ బరువు తగ్గడానికి ఉత్తమం.. దీనితో పాటు ఫ్రీైస్టెల్ స్ట్రోక్స్ చేయడం ద్వారా కూడా కేలరీలు బర్న్ చేస్తుంది. ఎంతవేగంగా ఈత కొడితే అంత ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి. వేగం పెంచడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ ఆనందంతో పాటు ఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ చేస్తే కాలి బొటనవేలు నుంచి తలభాగం వరకు ప్రతీ అవయవం కదలడంతో పాటు పూర్తి వ్యాయామం అవుతుంది. కీళ్లనొప్పులు, ఊపిరితిత్తుల వ్యాధులు తగ్గించేందుకు, రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు రక్తపోటు, మధుమేహస్థాయిని సక్రమంగా అదుపులో ఉంచేందుకు ఉపకరిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఎంజాయ్ చేస్తున్నా..
టూ మంత్స్ నుంచి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నా. మా నాన్న శ్రీనివాస్‌రెడ్డి ప్రోత్సాహంతో స్విమ్మింగ్ నేర్చుకొని పోటీల్లో పాల్గొంటారు. ఇక్కడ అందరూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. పోటీ పడి మరీ ఈత కొడుతున్నాం.
– కె.అనుషూల్రెడ్డి, థర్డ్ క్లాస్
చాలామంది ఆసక్తిగా ఉన్నారు..
స్విమ్మింగ్ నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఎండవేడిమిని తట్టుకునేందుకు సాయంత్రం వేళలో ఎక్కువ వస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు స్విమ్మింగ్‌కి దూరంగా ఉన్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే 600 మంది వరకు వస్తుండగా ఇంకా 200 మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉదయం 6 నుంచి 8 వరకు సాయంత్రం 4 నుంచి 6 గంటలకు మూడు విభాగాలు విభజించి నేర్పిస్తున్నా. ప్రత్యేకంగా చిన్నారులకు కొలను అందుబాటులో ఉన్నాయి.
– రాయబారపు , నవీన్‌కుమార్, కోచ్
హాట్ వెదర్లో కూల్‌గా..
నేను మా ఫ్రెండ్ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తున్నాం. వన్ మంత్ అవుతోంది. రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంకా పూర్తిస్థాయిలో నేర్చుకోవాలి. చాలామంది వస్తున్నారు. సమ్మర్లో స్విమ్మింగ్ చేయడం చాలా కూల్‌గా అనిపిస్తోంది.
– వందనారెడ్డి, విద్యార్థిని
ఫస్ట్ భయమేసింది..
స్విమ్మింగ్ చేసేందుకు ఫస్ట్ చాలా భయమేసింది. స్విమ్మింగ్ పూల్‌లోకి దిగిన తర్వాత హ్యాపీగా ఉంది. జస్ట్ ఫైవ్ డేస్ అవుతోంది. ఇప్పుడు చాలా సరదాగా నేనే స్విమ్ చేస్తున్నా. స్విమ్మింగ్ చేసేందుకు పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు.
– తిరునగిరి దీక్షిత్, న్యూశాయంపేట
స్విమ్మింగ్ అంటే ఇష్టం..
నేను నాల్గో తరగతి చదువుతున్నా. నాకు స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాలుగు రోజుల నుంచే వస్తున్నా. చాలామంది ఫ్రెండ్స్ వస్తున్నారు.. స్విమ్మింగ్ పూల్ నిండిపోతుంది. అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం. కోచ్ నవీన్‌కుమార్ సార్ స్విమ్మింగ్ ట్రిక్స్ చెబుతున్నారు.
– ఏ.హేమంత్‌కుమార్, హనుమకొండ