నర్సంపేట రూరల్, మే 14: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ మహిళ మృతిచెందిన సంఘటన మండలంలోని రామవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ గ్రామ మాజీ అధ్యక్షుడు మోతె రాజిరెడ్డి-శ్రీలత(42) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు. గత ఏడాది పెద్ద కూతురు బిందు వివాహం జరిపించారు. వీరికి ఇదే గ్రామ శివారులో 2ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. శనివారం ఉదయం 9 గంటలకు శ్రీలత తమ వ్యవసాయ భూమి వద్దకు వెళ్లింది.
అక్కడే వ్యవసాయ పనులు చేస్తూ ఉంది. మధ్యాహ్నం దాహం కావడంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది. బావి నుంచి తాగునీటిని పైకి తోడుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడింది. చుట్టుపక్కల వారు గమనించి ఆమెను బయటకు తీసేలోపే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నర్సంపేట మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతురాలి కుటుంబాన్ని రామవరం, లక్నెపల్లి గ్రామాల సర్పంచ్లు కొడారి రవన్న, గొడిశాల రాంబాబు, ఉప సర్పంచ్లు జినుకల విమల-శంకర్, పరాచికపు సంతోశ్, టీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. తొలుత శ్రీలత మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.