వర్ధన్నపేట, మే 12 : రాష్ట్రంలో అడవుల శాతం పెంచడమే లక్ష్యంగా చేపట్టిన హరిహారం ఎనిమిదో విడుత విజయవంతానికి జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. ప్రస్తుతం 48.30 లక్షల మొక్కలను అధికారులు పంచాయతీ నర్సరీల ద్వారా పెంచుతున్నప్పటీకీ ఈ ఏడాది 26.92 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. మిగిలిన మొక్కలను వచ్చే ఏడాదికి ఉపయోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే జిల్లాలో అటవీశాఖ ద్వారా వరంగల్, నర్సంపేట రేంజ్ల పరిధిలో 16 నర్సరీలను ఏర్పాటు చేసి 6 లక్షల మొక్కలను పెంచుతున్నారు. వర్షాలు ప్రారంభం కాగానే జిల్లా ఉన్నతాధికారులు శాఖల వారీగా మొక్కలను కేటాయించి నాటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
323 ఈజీఎస్ నర్సరీలు..
జిల్లాలో వరంగల్ నగరం మినహా 11 గ్రామీణ మండలాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా 323 నర్సరీలను ఏర్పాటు చేసి 48.30లక్షల మొక్కలను పెంచుతున్నారు. ఇందులో చెన్నారావుపేట మండలంలో 30 నర్సరీల్లో 3.81లక్షల మొక్కలు, దుగ్గొండిలో 34 నర్సరీల్లో 4.99లక్షలు, గీసుగొండలో 21 నర్సరీల్లో 2.47లక్షలు, ఖానాపురంలో 20 నర్సరీల్లో 2.47లక్షలు, నల్లబెల్లిలో 29 నర్సరీల్లో 3.84లక్షలు, నర్సంపేటలో 27 నర్సరీల్లో 3.49లక్షలు, నెక్కొండలో 39 నర్సరీల్లో 5.2లక్షలు, పర్వతగిరిలో 33నర్సరీల్లో 4.77లక్షలు, రాయపర్తిలో 39 నర్సరీల్లో 5.07లక్షలు, సంగెంలో 33 నర్సరీల్లో 4.14లక్షలు, వర్ధన్నపేట మండల పరిధిలోని 18 నర్సరీల్లో 2.07లక్షల మొక్కలు పెంచుతున్నారు. జిల్లా మొత్తంగా 48.30లక్షల మొక్కలను పెంచుతున్నప్పటీకీ ఈ ఏడాది 26లక్షల 92వేల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగిలిన మొక్కలు వచ్చే ఏడాది కోసం ఉపయోగించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా రూ.8.43 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని చెబుతున్నారు.
16 అటవీశాఖ నర్సరీలు..
జిల్లాలోని వరంగల్, నర్సంపేట రేంజ్ల పరిధిలో హరితహారం కోసం 16 నర్సరీలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 6 లక్షల మొక్కలను నాటాలని అటవీశాఖ అధికారులు టార్గెట్గా ఎంచుకున్నారు. 6 లక్షల్లో 3 లక్షల మొక్కలను అధికారులు నర్సరీల్లో పెంచుతుండగా మరో 3లక్షల మొక్కలను బయట నుంచి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేశారు. వర్షాలు కురవడం ప్రారంభం కాగానే మొక్కలను కలెక్టర్ ఆదేశాల మేరకు శాఖల వారీగా అందించి హరితహారం నిర్వహించనున్నారు. అటవీశాఖ ద్వారా ప్రజలకు అవసరమైన పూల మొక్కలతో పాటు భారీ వృక్షాలుగా పెరిగే మొక్కలను కూడా పెంచుతున్నారు.
రక్షణకు ప్రత్యేక చర్యలు..
ఎండలు తీవ్రంగా ఉండడంతో నర్సరీల్లో మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నర్సరీల్లో పెరుగుతున్న మొక్కలకు నేరుగా ఎండ తగలకుండా షేడ్నెట్లను ఏర్పాటు చేశారు. అలాగే నిత్యం రెండుసార్లు మొక్కలకు నీరు అందించేందుకు ఉపాధి, అటవీశాఖకు చెందిన సిబ్బంది, కూలీలను నియమించారు. అలాగే గతంలో రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చనిపోకుండా జీపీల ద్వారా నిత్యం నీరు అందిస్తున్నారు.
పకడ్బందీగా మొక్కలు నాటిస్తాం..
– మిట్టపల్లి సంపత్రావు, డీఆర్డీవో, వరంగల్
8వ విడుత హరితహారంలో పకడ్బందీగా మొక్కలు నాటించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది ఈజీఎస్ ద్వారా 26.92 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఎంచుకున్నాం. ఇందులో డీఆర్డీఏ ద్వారా 5.85లక్షలు, డీపీవో ద్వారా 9.50లక్షలతో పాటు వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలకు కూడా మొక్కలు కేటాయించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ శాఖలను హరితహారంలో భాగస్వామ్యం చేస్తాం. ప్రజలకు ఉపయోగపడేలా పూల మొక్కలు పెంచుతున్నాం. వర్షాలు కురవడం ప్రారంభం కాగానే మొక్కలు నాటిస్తాం. నర్సరీల్లో మొక్కలు ఎండలకు అన్ని మండలాల ఏపీవోలు, సిబ్బంది విశేషంగా పనిచేస్తున్నారు.