వరంగల్, మే 9(నమస్తేతెలంగాణ) : కోనారెడ్డి చెరువు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ఈ చెరువు కట్ట తెగిపోయింది. దీంతో వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిలోని సంగెం వాగు వంతెన అప్రోచ్‌రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోవడంతో ఎన్‌హెచ్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ చొరవతో ప్రభుత్వం చెరువు కట్ట తాత్కాలిక మరమ్మతులకు నిధులు మంజూరు చేయగా జలవనరుల శాఖ ఇంజినీర్లు తెగిన కట్ట స్థానంలో 80 మీటర్ల పొడవు రింగ్‌బండ్ నిర్మించారు. దీంతో ఈ చెరువు కింది ఆయకట్టుకు వానాకాలం, యాసంగిలో నీటి సరఫరా జరుగుతున్నది.
కోనారెడ్డి చెరువు కింద జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం 1,727 ఎకరాల నిర్దేశిత ఆయకట్టు ఉంది. భారీ వర్షాలతో కట్ట తెగిపోయిన సమయంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే రమేశ్ కోనారెడ్డి చెరువు పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. శాశ్వత మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన సీఎం కేసీఆర్ శాశ్వత మరమ్మతులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం కేసీఆర్ సాధ్యమైనంత త్వరలో అంచనాలు రూపొందించి అందజేయాలని ఆదేశించారు. దీంతో జలవనరుల శాఖ ఇంజినీర్లు చెరువు శాశ్వత మరమ్మతుల కోసం రూ.13.62 కోట్లతో అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. పరిశీలించిన ప్రభుత్వం ఈ అంచనాలకు ఆమోదముద్ర వేసింది. పాలనాపరమైన ఉత్తర్వులు వెలువడగానే జలవనరుల శాఖ అధికారులు టెండర్లు ఆహ్వానించారు. టెండర్ పొందిన కాంట్రాక్టు సంస్థ అగ్రిమెంట్ కుదుర్చుకొని పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది.
కట్ట పటిష్టం.. కొత్త తూములు..
శాశ్వత మరమ్మతుల్లో భాగంగా కోనారెడ్డి చెరువు కట్ట పటిష్టం కానుంది. గతంలో మిషన్ కాకతీయ పథకం నిధులతో ఈ చెరువు కట్టను జీరో నుంచి 1.50కిమీ వరకు ఐదు మీటర్ల వెడల్పుతో పటిష్టం చేశారు. 2020 ఆగస్టులో తెగిన కట్ట స్థానంలో 1.50 నుంచి 2.30కిమీ వరకు ప్రస్తుతం 80 మీటర్లు ఐదు మీటర్ల వెడల్పుతో పటిష్టం చేయనున్నారు. ప్రధానంగా రూ.13.62 కోట్ల పనుల్లో ఈ చెరువు కట్టను 300 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పుతో మినీ ట్యాంకు బండ్ మాదిరిగా తీర్చిదిద్దనున్నారు. చెరువు కట్టకు ఉన్న మూడు తూములు శిథిలావస్థకు చేరడంతో వీటి స్థానంలో కొత్త తూములను నిర్మించనున్నారు. మూడున్నర కి.మీ ఫీడర్ చానల్లో పూడిక మట్టి తొలగించి మరమ్మతులు చేస్తారు. చెరువు పంట కాల్వ మధ్యలో 40 మీటర్లతో ఒక మాటు నిర్మిస్తారు.
చెరువు మత్తడికి మరమ్మతులు చేస్తారు. కాగా, చెరువు శాశ్వత మరమ్మతులపై ఎమ్మెల్యే అరూరి కొద్దిరోజుల క్రితం జలవనరుల శాఖ ఇంజినీర్లతో సమావేశమై పలు సూచనలు చేశారు. నిర్దేశిత కాలపరిమితిలోగా పనులు పూర్తి చేయాలని చెప్పారు. పనులు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగాయని జలనవరుల శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్(ఈఈ) ఆంజనేయులు తెలిపారు. ఈ చెరువు పనులకు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే అరూరితో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పాల్గొంటారు.