కరీమాబాద్, మే 9 : ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లిన కరీమాబాద్‌కు చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఎల్బే నదిలో పడి గల్లంతయ్యాడు. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రేట్ వరంగల్ 32వ డివిజన్ కరీమాబాద్‌కు చెందిన కడారి అఖిల్(25) 3 సంవత్సరాల క్రితం ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లాడు. ప్రస్తుతం మాగ్డేబర్గ్ ప్రాంతంలో ఉంటూ అక్కడి ఒట్టోవాన్ జ్యూరిక్ యూనివర్సిటీలో సోలార్ అండ్ ఎనర్జీ ఇంజినీరింగ్‌లో ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల పరీక్షలు పూర్తికాగా ప్రాజెక్ట్ వర్క్ కోసం అక్కడ ఉన్నాడు. ఈక్రమంలో ఆదివారం స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఎల్బే నదిలో పడి గల్లంతయ్యాడు. కాగా, అఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు జర్మనీలోని భారత రాయబారి కార్యాలయ అధికారులు అఖిల్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అఖిల్ తండ్రి కడారి పరశురాములు మేస్త్రీగా అందరికీ సుపరిచితుడు. అఖిల్‌కు ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు.
పరామర్శించిన ఎమ్మెల్యే నరేందర్..
బాధిత కుటుంబాన్ని సోమవారం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరామర్శించారు. పరశురాములుకు ధైర్యం చెప్పి ఓదార్చారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుపోనున్నట్లు తెలిపారు. ఆయన వెంట నాగపురి సంజయ్‌బాబు, బొమ్మల్ల అంబేద్కర్, బొల్లం రాజు, వొగిలిశెట్టి అనిల్, పొగాకు సందీప్ ఉన్నారు.