మంచి సేవలతో ప్రజలకు చేరువ కావాలని వైద్యులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. సర్కారు వైద్యశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం, పీఎంఎస్ఎస్వై, సీకేఎం హాస్పిటళ్లతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య శాఖపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్‌తో కలిసి హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యులు, అధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. పనిచేసేవారికి ప్రోత్సాహం ఉంటుందని, పనితీరు సరిగా లేనివారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐవీఎఫ్ సేవలను వరంగల్‌కు విస్తరిస్తామని వెల్లడించారు.
వరంగల్, మే 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మెరుగైన సేవలతో ప్రజలను మరింత చేరువకావాలని వైద్యులకు మంత్రి హరీశ్‌రావు సూచించారు. కాకతీయ మెడికల్ కాలేజీ, ఎంజీఎం, పీఎంఎస్ఎస్వై, సీకేఎం హాస్పిటళ్లతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాల వైద్య శాఖపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్లతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇక్కడ హరీశ్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య సేవల పరంగా తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలువాలని, ఇందుకు అధికారులు, వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని రకాల పరికరాలు, యంత్రాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ యంత్రమైనా.. పరికరమైనా చెడిపోతే వెంటనే మరమ్మతులు చేసి వినియోగం లోకి తేవాలని స్పష్టం చేశారు. వైద్య పరికరాలు, యంత్రాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.20కోట్లు కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో పారిశుధ్యం, డైట్ సేవలు మెరుగయ్యాయన్నారు.
వైద్య సేవలు చేయడంలో ఆనందం, గొప్ప అనుభూతి ఉంటుందని, సేవల పరంగా ప్రజలకు చేరువ కావాలని డాక్టర్లు, వైద్య సిబ్బందికి సూచించారు. త్వరలోనే 13 వేల డాక్టర్ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. కొత్త నియామకాలతో వచ్చే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకుండా విధానపరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం నిబంధన కొత్త డాక్టర్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఐవీఎఫ్ సేవలను వరంగల్‌కు విస్తరిస్తామని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖపై రాష్ట్ర స్థాయిలో ప్రతి నెలా సమీక్షిస్తామని, జిల్లా స్థాయిలోనూ ప్రతి నెలా సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ‘ప్రజలకు మంచి సేవలు అందించడం అందరి బాధ్యత. అందరూ పాజిటివ్‌గా తీసుకోవాలి. పోటీతత్వంతో పని చేయాలి.
పని చేసే వారికి ప్రోత్సాహం ఉంటుంది. చేయని వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయి. మాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదు. మీ సమస్యలు పరిషారిస్తాం. దేశంలోనే తెలంగాణ హెల్త్ అంటే అద్భుతంగా ఉంది అనేలా పనిచేయాలి. మిషన్ భగీరథ, కాళేశ్వరం సహా తెలంగాణలోని అన్ని పథకాలు, కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. హెల్త్ క్యాలెండర్ ఏర్పాటు చేసుకొని ప్రతి నెల నేనే మీ వద్దకు వస్తున్న. సమస్యలు పరిషరించుకుందాం. సిజేరియన్లు తగ్గించేలా డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రతి నార్మల్ డెలివరీకి మూడు వేల రూపాయలు చెల్లిస్తాం. తెలంగాణలో ఇంటింటికీ వెళ్లి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నాం. ఈ వివరాల ఆధారంగా బీపీ, షుగర్ పేషంట్లకు ప్రతి నెలా మందులు పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత లేదు. డాక్టర్లు మందులను బయటికి రాస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది.
పేదలకు ఉచిత వైద్యం కోసం ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలలి. వైద్య, ఆరోగ్యంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలువాలి. ఇందుకోసం డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రయత్నించండి. 24గంటలు నేను అందుబాటులో ఉంటా. మీకు ఇబ్బందులు వస్తే మీ కోసం నిలబడుతాం. ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని చెప్పారు. సమీక్ష సమావేశంలో గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి, జడ్పీ అధ్యక్షులు ఎం.సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, పాగాల సంపత్‌రెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బండా ప్రకాశ్, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు టీ రాజయ్య, అరూరి రమేశ్, చల్లా ధర్మారెడ్డి, నన్నపునేని నరేందర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవారెడ్డి, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ సుందర్‌రాజుయాదవ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, ఎంజీఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.