వర్ధన్నపేట, మే 9 : వర్ధన్నపేట మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తెలిపారు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంతి తన్నీరు హరీశ్‌రావు కోనారెడ్డి చెరువు కట్ట మరమ్మతులు, అంబేద్కర్ సెంటర్ వద్ద పాత అతిథిగృహం స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు మంగళవారం రానున్నారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సోమవారం కోనారెడ్డి చెరువుకట్ట, ఇంటిగ్రేటెడ్ భవనం నిర్మించనున్న స్థలాలను పరిశీలించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వర్ధన్నపేట పట్టణ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు కోనారెడ్డి చెరువు కట్ట కోతకు గురికాగా, రైతులకు సాగునీరు అందించడం కోసం రింగ్‌బండ్‌ను నిర్మించామని వివరించారు. కట్టకు శాశ్వత మరమ్మతులు చేయాలని కేసీఆర్‌ను కోరగా, రూ.14 కోట్లతో పాటు పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం మరో రూ.2 కోట్లు మంజూరు చేశారన్నారు. దీంతో త్వరలోనే కట్టకు శాశ్వత మరమ్మతుతో పాటు ఆధునిక పద్ధతిలో తూములు, కట్ట వెడల్పు తదితర పనులు చేస్తామన్నారు. చెరువును గోదావరి జలాలతో నింపితే సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని తెలిపారు. మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేటకు రానున్నందున నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
అలాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం నిర్మించనున్న స్థలంలో 5వేల మందితో ఏర్పాటు చేయనున్న సభలో మంత్రి హరీశ్‌రావు ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్‌చైర్మన్ ఏలేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ గొడిశాల రవీందర్, రైతు బంధు సమితి కన్వీనర్ అల్లమనేని మోహన్‌రావు, మాజీ జడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి, కౌన్సిలర్లు రవీందర్, రాజమణి, రామకృష్ణ, నాయకులు సిలువేరు కుమారస్వామి, పూజారి రఘు, పులి శ్రీనివాస్, తిరుపతి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.