పోచమ్మమైదాన్, మే 9 : నగరంలో నీటి సరఫరా పెండింగ్ పనులన్నీ ఈ నెల 18లోగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశాయిపేట ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్ ఆవరణలో 3,11,12.13.14,15,16, 29 డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పైపులైన్ లీకేజీలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలన్నారు.
ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాటర్ రీస్టోరేషన్, ఇంటర్ కనెక్షన్, రోడ్డు డ్యామేజీల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు.నిర్ధిష్ఠ గడువులోగా పనులు పూర్తయ్యేలా ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. 14వ డివిజన్ కీర్తినగర్ కాలనీకి ఫీడర్ పైపులైన్ ద్వారా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, 15వ డివిజన్ గణేశ్‌నగర్ కాలనీలో తాగునీటి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని, 29వ డివిజన్ పెద్ద మోరీ వద్ద పైపులైన్ పగిలి నీరు కలుషితం అవుతున్నదని, తక్షణమే పైపులైన్ మార్చాలని అధికారులను ఆదేశించారు.
ఫిల్టర్ బెడ్లకు కొత్త మోటర్ బిగించినప్పటికీ ప్రెషర్ పెరుగడం లేదని, పరిశీలించి, చర్యలు తీసుకోవాలని ఈఈ లక్ష్మారెడ్డికి సూచించారు. బోర్లకు మరమ్మతు చేయాలన్నారు. పైపులైన్‌ను మూడు ఫీట్ల లోతులో వేయాలని ఎంసీసీ ఏజెన్సీని మేయర్ ఆదేశించారు. సమావేశంలో కార్పొరేటర్లు సురేశ్‌కుమార్ జోషి, కావేటి కవిత, జన్ను శిభారాణి, అనిల్‌కుమార్, తూర్పాటి సులోచన, దేవరకొండ విజయలక్ష్మి, ఈఈలు రాజయ్య, లక్ష్మారెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ రాజ్‌కుమార్, డీ నుస్రత్, రవికిరణ్, ఏఈలు కృష్ణమూర్తి, కార్తీక్‌రెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.