వరంగల్, మే 5(నమస్తే తెలంగాణ) : దుగ్గొండి మండలం చలపర్తి గ్రామంలో రైతు లగ్గొండి వీరస్వామి గతంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామ సర్పంచిగా పనిచేశాడు. ఆయన ఏడాది క్రితం చనిపోయాడు. రైతు కావడం వల్ల ఇతని కుటుంబానికి రైతుబీమా పథకం వర్తించింది. ఈ పథకం నుంచి తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షలు మంజూరు చేసింది. ఈ డబ్బు చెక్కు రూపంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతుడు వీరస్వామి భార్య అనసూర్యకు అందజేశారు. అలాగే వీరస్వామి భార్య అనసూర్యకు నెలనెలా దివ్యాంగుల పింఛన్ రూ.3,016 అందుతోంది. వీరస్వామి కొడుకు సుభాష్‌కు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి పంట పెట్టుబడి కోసం ఏటా రెండు విడుతలు రూ.10వేల చొప్పున రూ.25 వేలు జమచేస్తోంది. అలాగే వ్యవసాయానికి 24గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా చేస్తోంది. వీరస్వామి తండ్రి బొంద్యాలు మూడు నెలల క్రితం మరణించాడు. చనిపోయే వరకు బొంద్యాలు వృద్ధాప్య పింఛన్ రూ.2,016 పొందాడు. వీరస్వామి కూతురు ప్రేమలతకు ప్రభుత్వం కేసీఆర్ కిట్ వర్తింపజేసింది. సర్కారు దవాఖానలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఆమెకు రూ.12వేల ఆర్థిక సహాయం అందింది.
ఖానాపురం మండలకేంద్రంలోని రైతు వీరమళ్ల రాములుకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికి ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత కరంటు సరఫరా అవుతోంది. పంట పెట్టుబడి కోసం ఏటా రూ.25వేల ఆర్థిక సహాయం అందుతోంది. రాములు కూతురు శ్రీవిద్యకు 2020లో వివాహం జరుగగా, కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1,00,16 ఆర్థిక సహాయం అందింది. అతడి తల్లి రాంబాయికి ఆసరా పథకం నుంచి నెలనెలా వృద్ధాప్య పింఛన్ రూ.2,016 వస్తోంది.
దుగ్గొండి మండలం చలపర్తిలో సాధారణ రైతు దూలం రామకృష్ణ. ఇటీవల అతడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల ఎల్వోసీ మంజూరు చేసింది. రామకృష్ణ భార్య సుధకు ఇటీవల సీఎం రిలీఫ్‌ఫండ్ నుంచి రూ.33వేలు అందాయి. అతడి తండ్రి సమ్మయ్యకు నెలనెలా వృద్ధాప్య పింఛన్ రూ.2,016, తల్లి వీరలక్ష్మికి దివ్యాంగుల పింఛన్ రూ.3,016 అందుతోంది. రామకృష్ణ కుటుంబానికి ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు విడుతలు కలిపి రూ.15వేలు బ్యాంకులో జమవుతున్నాయి.