పిల్లల బంగారు భవిష్కత్ కోసం చిట్టీలు కట్టిన వారు నిండా మునిగారు. 20 సంవత్సరాలుగా నమ్మకంగా ఉన్న ఓ చిట్టీ నిర్వాహకుడు సుమారు 600 మందికి రూ. 30కోట్లకు ఎగనామం పెట్టి రాత్రికిరాత్రే పరారయ్యాడు. నగరంలోని 18వ డివిజన్ టీఆర్టీ కాలనీకి చెందిన మూడెడ్ల వెంకటేశ్వర్లుకు చెందిన కల్పవల్లి అసోసియేట్స్ ఫైనాన్స్ ట్రేడర్స్ కంపెనీలో స్థానికులు 20 సంవత్సరాలుగా చిట్టీలు కడుతున్నారు. చిట్టీ ఎత్తుకోగానే ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. వడ్డీ ఆశతో కొందరు చిట్టీ ఎత్తుకున్న డబ్బులను అతడికే ఇచ్చేవారు. అలాగే, మరికొందరి వద్ద ఫిక్స్డ్ డిపాజిట్ పేరుతో రూ. కోట్లల్లో వసూలు చేశాడు. హఠాత్తుగా వారం క్రితం ఇంటి నుంచి పరారయ్యాడు. గత ఆదివారం వెంకటేశ్వర్లు ఐపీ పెట్టినట్లు కొందరికి నోటీసులు అందడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. కాలనీలోని ఆఫీసు ఎదుట సోమవారం ఆందోళన చేశారు. ఆదుకోవాలంటూ వేడుకున్నారు.
కాశీబుగ్గ, మే 2 : చిట్టీల పేరుతో ఓ వ్యాపారి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టాడు. సుమారు రూ.30కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నగరంలోని 18వ డివిజన్ టీఆర్టీ కాలనీకి చెందిన మూడెడ్ల వెంకటేశ్వర్లు 20 సంవత్సరాలుగా కల్పవల్లి అసోసియేట్స్ ఫైనాన్స్ ట్రేడర్స్ పేరుతో ఒక కంపెనీ నడుపుతున్నాడు. అందరితో నమ్మకంగా ఉండడంతో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల వారు చిట్టీలు కట్టడం ప్రారంభించారు. చిట్టీలు ఎత్తుకున్న వారికి వెంటనే డబ్బులు తిరిగి ఇచ్చేవాడు. దీంతో అతడిని నమ్మి తమ దగ్గర ఉన్న డబ్బులను వడ్డీ ఆశతో ఇచ్చారు. అలాగే, కొందరు చిట్టీలు ఎత్తుకొని వచ్చిన డబ్బులను అతడికే ఇచ్చేవారు. కొన్ని సంవత్సరాల క్రితం ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో కోట్లు వసూలు చేశాడు. కాగా, డిపాజిట్ల గడువు ముగియడంతో బాధితులు ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో బాధితులు వెంకటేశ్వర్లుతో వాగ్వాదానికి దిగారు. వారం క్రితం శ్రీకాళహస్తికి వెళ్తున్నట్లు అందరినీ నమ్మించి ఇంట్లో నుంచి పారిపోయారు. వెంకటేశ్వర్లు ఐపీ పెట్టినట్లు కొందరికి ఆదివారం నోటీసులు అందడంతో సుమారు 600 మంది బాధితులు లబోదిబోమంటున్నారు. సోమవారం చిట్స్ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులను వేడుకున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది పేద, మధ్యతరగతి వారే ఉన్నారు. పైసా పైసా కూడబెట్టుకొని పిల్లల బంగారు భవిష్యత్ కోసం డబ్బులు జమచేశామని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి నట్టేట ముంచాడని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న ఏసీపీ కలకోట గిరికుమార్ అక్కడకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. ఆఫీసులోని కంప్యూటర్ను స్వాధీనం చేసుకొని బాధితుల వివరాలను సేకరిస్తామన్నారు. అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. కాగా, బాధితులు మిల్స్ కాలనీ పోలీసులకు చిట్స్ వ్యాపారిపై ఫిర్యాదు చేశారు.
ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం చిట్టీలు వేశా..
– పోరండ్ల స్వప్న, చెన్నారెడ్డికాలనీ వాసి
నా భర్త బిస్కెట్లు అమ్మి, నేను బిడీలు చేసి రూపాయి రూపాయి పోగు చేసి రూ.16లక్షల వరకు ఇచ్చాం. ఇద్దరు కుతుళ్లు పెండ్లికి ఉన్నారు. నా భర్త ఆరోగ్యం మంచిగా లేదు. ప్రస్తుతం పని చేసుకునే పరిస్థితి కూడా లేదు.
20 ఏళ్ల నుంచి జమ చేసిన..
– పర్వీన్ సుల్తానా, స్థానికురాలు
నేను ప్రైవేట్ దవాఖానలో స్వీపర్‌గా పనిచేస్తూ, ఇంటి దగ్గర బీడీలు చేసి 20 ఏళ్లుగా జమచేసిన డబ్బులు వెంకటేశ్వర్లుకు ఇచ్చాను. సుమారు రూ.9లక్షలను ఇద్దరు కూతుళ్ల పెళ్లి కోసం కూడబెట్టిన. ఇప్పుడ ఏం చేయాలో తోచడం లేదు.