వరంగల్ చౌరస్తా, మే 2: టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే చూడలేని అంధులు బీజేపీ నాయకులు అని టీఆర్ఎస్ జిల్లా నాయకులు మర్రి శ్రీనివాస్, ఎండీ. చాంద్‌పాషా విమర్శించారు. సోమవారం 36వ డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య ఆధ్వర్యంలో చింతల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకుడు ఆడెపు వెంకటేశ్వర్లు చేసిన ఆరోపణలపై వారు ఘాటుగా స్పందించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిందంటున్న బీజేపీ నాయకులు కళ్లు తెరిచి చూడాలన్నారు. ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆజాంజాహి మిల్స్ స్థలంలో వరంగల్ కలెక్టరేట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తెచ్చారని తెలిపారు. రూ.27కోట్లతో పండ్ల మార్కెట్ ఆవరణలో మల్టీప్లెక్స్ రూపంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేసి, పనులు ప్రారంభించారని తెలిపారు. వరద ముంపు ప్రాంతమైన శివనగర్, మైసయ్యనగర్, ఆర్ఎస్ నగర్ ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు సుమా రు రూ.120కోట్లతో జిల్లాలోనే మొదటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టిన ఘనత తూర్పు ఎమ్మెల్యేదేనని చెప్పారు. రూ.14కోట్లతో అండర్ బ్రిడ్జిని రెండింతలు విస్తరించి, ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారని తెలిపారు. 50 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోని వరంగల్ స్టేషన్ రోడ్, జేపీఎన్ రోడ్లతోపాటు వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్లే ప్రధాన రహదారిని అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. వరంగల్ బస్టాండ్‌ను మోడల్ బస్టాండ్‌గా మార్చేందుకు రూ.74కోట్లతో ప్రతిపాదనలు పంపనున్నా రని తెలిపారు.
గుడిసె వాసులుగా జీవిస్తున్నవారికి పట్టాలు అందించారని చెప్పారు. నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లలో వందల కోట్లతో కమ్యూనిటీ హాల్స్ నిర్మించా రని తెలిపారు. ఎన్ని కల హామీ మేరకు చింతల్ ఆర్వోబీ నుంచి స్తంభంపల్లి వరకు రోడ్డు అభివృద్ధి పనులు పూర్తిచేశారని పేర్కొన్నారు. రూ.2.80కోట్ల వ్యయంతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మిస్తున్నా రని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో సీసీ రోడ్డు నిర్మాణాలు, డ్రైనేజీ పనులను చేపట్టారని వివరిం చారు. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంపై కానీ, నాయకు లపై కానీ అసత్య ప్రచారం చేస్తే బీజేపీ నాయకులను డివిజన్లలో తిరగకుండా అడ్డుకుంటామని అన్నారు. సమావేశంలో డివిజన్ నాయకులు గడల రమేశ్ యాదవ్, ఎండీ సమీనా, నాంపల్లి మధు, ఇజ్జగిరి కృష్ణ, చిన్నా పటేల్, నీలం నవీన్, రాజారపు అనిల్, బొజ్జ రాజ్‌కుమార్, మైదం నరేష్, ఎండీ అబ్బు, పత్తిపాక బాలరాజు, అంకుష్, గణేశ్ పాల్గొన్నారు.