వరంగల్, మే 1(నమస్తేతెలంగాణ) : జిల్లాలో వానాకాలం పంటల సాగుకు వ్యవసాయశాఖ సమాయత్తం అవుతున్నది. రైతులు సాగు చేయనున్న పంటల విస్తీర్ణంపై అంచనాలు రూపొందించింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తెచ్చే పనిలో తలమునకలైంది. అలాగే, సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్ణయించింది. ప్రతి మంగళ, శుక్రవారం రైతువేదికల్లో సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాళ్ ప్రకటించారు. ఈ ఏడాది పత్తి, కంది పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. గత సంవత్సరం 3.05 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. కాగా, ఈసారి సాగు విస్తీర్ణాన్ని 3.08 లక్షల ఎకరాలకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నారు.
సాగు నీటి వనరుల అభివృద్ధితో జిల్లాలో ఈ ఏడాది వానాకాలం పంటల సాగు విస్తీర్ణం పెరుగనుంది. 3,08,473 ఎకరాల విస్తీర్ణంలో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసిం ది. గత ఏడాది వరి 1.33లక్షల ఎకరాల్లో, పత్తి 1.09 లక్షల ఎకరాల్లో, మక్కజొన్న 21,185 ఎకరాల్లో, మిర్చి 19,032 ఎకరాల్లో, పసుపు 5,672ఎకరాల్లో, వేరుశనగ 5,444ఎకరాల్లో, కంది 2,192 ఎకరాలు ఉంది. 12,233 ఎకరాల్లో రైతులు ఇతర పంటలను సాగు చేశారు. ఈసారి పత్తి 1,13,532ఎకరాల్లో, వరి 1,31,817ఎకరాల్లో, మక్కజొన్న 21,932ఎకరాల్లో, వేరుశనగ 5,027ఎకరాల్లో, మిర్చి 16,373ఎకరాల్లో, పసుపు 5,672ఎకరాల్లో, కంది 2,000ఎకరాల్లో, ఇతర పంటలు 12,120 ఎకరాల్లో రైతులు సాగు చేయవచ్చని తాజాగా ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నది.
ఈ మేరకు విత్తనాలు, ఎరువులను రైతులకు అందుబాటులోకి తెచ్చే పనిలో వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. 450 గ్రాముల పత్తి విత్తన ప్యాకె ట్లు జిల్లాకు 2.50 లక్షలు అవసరమని, పచ్చిరొట్ల సాగు చేసేందుకు 8,798 క్వింటాళ్ల జీలుగ, జనుము, పిల్లిపిసర విత్తనాలు కావాలని ప్రభుత్వాన్ని కోరారు. మిర్చి విత్తనాలు ఎన్ని క్వింటాళ్లు అవసరం అనేది కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. ఎరువులెన్ని అవసరం.. వీటిలో యూరియా, కాంప్లెక్స్, డీఏపీ నిల్వలె న్ని ఉన్నాయి.. వీటితో పాటు ఎంవోపీ కూడా ఎన్ని వే ల టన్నులు కేటాయించాల్సిన అవసరం ఉంటుందనేది నివేదికలో తెలిపారు. ఈ ప్రతిపాదనలపై కలెక్టర్ బీ గోపి వ్యవసాయశాఖ జిల్లా అధికారి ఉషాదయాళ్తో పాటు ఉద్యానశాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. వానాకాలం సీజన్ ప్రారంభమయ్యేలోగా అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పత్తి, కంది పంటలపై ఫోకస్.. 
వ్యవసాయశాఖ ఈ ఏడాది ప్రధానంగా పత్తి, కంది పంటల సాగుపై ఫోకస్ పెట్టనుంది. లాభదాయకమైన ఈ రెండు పంటల సాగులో రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం చెబుతున్నది. ఈ నేపథ్యంలో వానాకాలం జిల్లాలో 1,13,532 ఎకరాల్లో పత్తి పంటను సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ, విస్తీర్ణాన్ని 1.25 లక్షల నుంచి 1.30 లక్షల ఎకరాలకు పెంచే దిశగా వ్యవసాయశాఖ అధికారులు అడుగులు వేస్తున్నారు.
దీంతో పాటు కంది పంట విస్తీర్ణాన్ని కూడా జిల్లాలో గత ఏడాది కంటే రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. రైతులకు ఈ రెండు పంటల సాగుపై అవగాహన కల్పించేందుకు ప్రణాళిక తయారు చేశారు. సీజన్ ప్రారంభానికి ముందుగానే అవగాహన సదస్సులను పూర్తి చేసేందుకు నిర్ణయించారు. రైతు వేదికల్లో ప్రతి మంగళ, శుక్రవారం అవగాహన సదస్సులు నిర్వహించి పంటల మార్పిడి, సాగు విధానం, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు, వాటి లభ్యత, విత్తనాలు, ఎరువులపై అవగాహన కల్పిస్తారు.
విస్తృత స్థాయిలో అవగాహన..
– ఉషాదయాళ్, డీఏవో, వరంగల్
వానాకాలం పంటల సాగుపై జిల్లాలో రైతులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. పంట మార్పిడి అనేది రైతులకు అవసరం. ఎప్పటికీ ఒకే పంట గాకుండా వేర్వేరు పంటలను సాగు చేయడం మంచిది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే లాభదాయకం. ముఖ్యంగా ఈ ఏడాది పత్తి, కంది పంట సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి పెట్టాం. ఈ పంటల సాగుతో కలిగే ప్రయోజనాలను ఏఈవోలు, ఏవోలు, ఇతర వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తున్నారు. గ్రామాల్లో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీల పత్తి, మిర్చి విత్తనాలు జిల్లాకు వచ్చాయి.